చంద్రబాబు దూరం: మళ్లీ కేసీఆర్ తో విభేదాలు

First Published Jun 28, 2018, 2:29 PM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మధ్య మళ్లీ విభేదాలు పొడసూపినట్లు ప్రచారం సాగుతోంది. 

విజయవాడ: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మధ్య మళ్లీ విభేదాలు పొడసూపినట్లు ప్రచారం సాగుతోంది. బెజవాడ కనకదుర్గ ఆలయానికి వచ్చిన కేసీఆర్ ను చంద్రబాబు కలుసుకోకపోవడానికి అదే కారణమని అంటున్నారు. 

కేసీఆర్ విజయవాడకు వచ్చిన సమయంలో చంద్రబాబు శ్రీకాకుళం పర్యటనలో ఉన్నారు. ఏరువాక ప్రారంభానికి ఆయన శ్రీకాకుళం జిల్లాకు వెళ్లారు. అయితే, కేసీఆర్ కు ఆంధ్రప్రదేశ్ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు స్వాగతం చెప్పారు. ప్రొటోకాల్ లో భాగంగా చంద్రబాబు దేవినేని ఉమకు ఆ బాధ్యతను అప్పగించారని అంటున్నారు.

ఇటీవలి కాలంలో జాతీయ స్థాయిలో సంభవించిన రాజకీయ సమీకరణాలు ఇరువురి మధ్య విభేదాలకు కారణమయ్యాయని అంటున్నారు. బిజెపి, కాంగ్రెసులకు వ్యతిరేకంగా కేసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదన చేశారు. అదే సమయంలో చంద్రబాబు బిజెపితో తెగదెంపులు చేసుకున్నారు. కాగా, కేసిఆర్ బిజెపికి దగ్గరైనట్లు కూడా భావిస్తున్నారు. దీంతో ఇరువురి మధ్య విభేదాలు చోటు చేసుకున్నట్లు భావిస్తున్నారు.

నీతి ఆయోగ్ సమావేశం సందర్భంగా కూడా ఢిల్లీలో వారిద్దరు కలుసుకోలేదు. నీతి ఆయోగ్ సమావేశానికి ముందే కేసిఆర్ ప్రధాని నరేంద్ర మోడీని కలవగా, చంద్రబాబు బిజెపి వ్యతిరేక ముఖ్యమంత్రులతో సమావేశమయ్యారు.  చంద్రబాబు కాంగ్రెసు అధ్యక్షుడు రాహుల్ గాంధీతో వేదికను పంచుకోవడం కూడా విభేదాలకు కారణమని అంటున్నారు. 

మరీ ముఖ్యంగా, పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో సభ నడవకుండా అడ్డుపడి తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు బిజెపికి సహకరించారనే అభిప్రాయంతో చంద్రబాబు ఉన్నట్లు చెబుతున్నారు. దాంతో కేసీఆర్ పై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విజయవాడలో ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ జరగలేదని అంటున్నారు.

click me!