ఒక్కరోజులో 300 సెంటీమీటర్ల కుంభవృష్టి.. ధర్మశాలను ముంచెత్తిన వరద, ఎటు చూసినా బురదే

By Siva KodatiFirst Published Jul 12, 2021, 2:58 PM IST
Highlights

ధర్మశాలలో ఒకే రోజు 300 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో నగరాన్ని భారీ వరద ముంచెత్తింది. ఎక్కడ చూసినా బురద పేరుకుపోయింది. ప్రజలు ఎత్తైన భవనాల మీదకు ఎక్కి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. 
 

హిమాచల్ ప్రదేశ్‌లోని ప్రముఖ పర్యాటక స్థలం ధర్మశాల నగరాన్ని వరదలు ముచెంత్తాయి. నగరంతో పాటు దాని చుట్టుపక్కల ఒక్కరోజులోనే 300 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు వెల్లడించారు. కుంభవృష్టి ధాటికి కొండల మీది నుంచి వరద నీరు ఉప్పొంగింది. ఇటు భాగ్సు నాగ్ నాలా ఉప్పొంగి దీనికి జత కావడంతో ధర్మశాలను వరద నీరు ముంచెత్తింది. దీంతో పలు ఇళ్లు కూలిపోయాయి. పారిశుద్ధ్య కార్మికుల గుడారాలు కొట్టుకుపోయాయి.

కార్లు సైతం కాగితపు పడవల్లా వరదల్లో కొట్టుకుపోయాయి. నగరంలో ఎక్కడ చూసినా బురద మయంగా మారింది. కాగా, అక్కడికి వచ్చిన ఢిల్లీ, చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన పర్యాటకులు వరదల్లో చిక్కుకుపోయినట్లుగా తెలుస్తోంది. మాంఝీ నది ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో గుడిసెలు, దుకాణాలు నాశనమయ్యాయి. షిమ్లా జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడడంతో రాకపోకలు నిలిచిపోయాయి.

కాగా, గడిచిన ఐదేళ్లుగా తమకు మంచి ఇళ్లు కట్టించాలని పారిశుద్ధ్య కార్మికులు డిమాండ్ చేస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో తాజా వరదల్లో వారు సర్వం కోల్పోయారు. దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇటు భాగ్సు నాగ్ ప్రాంతంలో వందలాది మంది వరదల్లో చిక్కుకుని సాయం కోసం పడిగాపులు కాస్తున్నారు. 
 

click me!