మకరజ్యోతి దర్శనం: శబరిమలకు పోటెత్తిన భక్తజనం

By telugu teamFirst Published Jan 15, 2020, 7:11 PM IST
Highlights

సంక్రాంతి పర్వదినం సందర్భంగా శబరిమలలో బుధవారం సాయంత్రం మకరజ్యోతి దర్శనం జరిగింది. లక్షలాది మంది భక్తులు శబరిమలలో మకరజ్యోతిని దర్శించారు. ఈ సందర్భంగా శబరిమలలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

శబరిమల: సంక్రాంతి పర్వదినం సందర్భంగా లక్షలాది మంది భక్తులు బుధవారం సాయంత్రం మకర జ్యోతిని దర్శించుకున్నారు. బుధవారం సాయంత్రం 6.45 గంటల సమయంలో పొన్నాంబమేడులో మకర జ్యోతి దర్శనం జరిగింది. 

మకరజ్యోతిని దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు శబరిమల చేరుకున్నారు. అక్కడ గంటల తరబడి వేచి చూశారు. అయ్యప్ప స్వాములు, భక్తులు శబరిమలకు పోటెత్తారు. అయ్యప్ప స్వామి నినాదాలతో ఆ ప్రాంతం మారుమ్రోగింది. 

పంబ నుంచి సన్నిధానం వరకు భక్తులు బారులు తీరారు. మకర జ్యోతి దర్శనం సందర్భంగా అయ్యప్పను ప్రత్యేక ఆభరణాలతో అలంకరించారు. ఈ సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 

భారీ పోలీసు సిబ్బందిని, ఎన్డీఆర్ఎఫ్, ర్యాపిడ్ రెస్పాన్స్ ఫోర్స్ ను శబరిమలలో దించారు. 15 మంది డిప్యూటీ ఎస్పీలు, 36 మంది ఎస్సీలతో పాటు 1,400 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. 

డిసెంబర్ 30వ తేదీ నుంచి అయ్యప్ప స్వామి దర్శనం కోసం భక్తులను అనుమతిస్తున్నారు. ఈ నెల 20వ తేదీ వరకు భక్తులను అనుమతిస్తారు. ఆ తర్వాత జనవరి 21వ తేదీన పడిపూజ నిర్వహించి ఆలయాన్ని మూసివేస్తారు. మకరజ్యోతి తర్వాత ఐదు రోజుల పాటు ఆలయ ద్వారాలు తెరిచి ఉంటాయి. దాన్ని మకర విలక్కు అంటారు. 

70 మంది సభ్యులతో కూడిన బాంబ్ స్క్వాడ్, 20 మందితో కూడిన టెలీ కమ్యూనికేషన్ వింగ్ ను ఏర్పాటు చేశారు. 

click me!