
Devendra Fadnavis: మహారాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ( Devendra Fadnavis ) మరోసారి శివసేనపై విమర్శనాస్త్రాలు సంధించారు. మసీదుల నుండి లౌడ్ స్పీకర్లను తొలగించడానికి భయపడే వారు, బాబ్రీ మసీదును కూల్చినట్లు చెబుతున్నారని విమర్శించారు. ముంబైలోని సోమయ్య మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ నినాదాలు చేస్తూ ఫడ్నవీస్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్‌కు నివాళులర్పించారు. మహారాష్ట్ర దినోత్సవం, కార్మిక దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
మీరు హిందుత్వవాదులు కాదు
MVA పరిపాలనపై విమర్శల దాడిని ప్రారంభించిన Devendra Fadnavis.. తమ అవమానాన్ని మహారాష్ట్ర అవమానంగా భావించే వారు చాలా తక్కువ మంది ఉన్నారని అన్నారు. అలాంటి వ్యక్తులు మరాఠీ లేదా హిందువులు కాదని పరోక్షంగా శివసేనను విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వంలో అవినీతి జరిగినప్పుడల్లా.. మహారాష్ట్ర పరువు పోతుందని, రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ప్రభుత్వం (శివసేన) ఎవరి కోసం పనిచేస్తుందనేదని ప్రశ్నించారు. ఇద్దరు మంత్రులు జైలులో ఉన్నారని, అయితే ప్రభుత్వ నిర్ణయాలపై జైలులో ఉన్న మంత్రి ఫొటోను సిగ్గు లేకుండా ముద్రించారని మండిపడ్డారు. ఇంతకు ముందు ఇంటి నుంచి పనులు చక్కబెట్టేవారని, ఇప్పుటు ఏకంగా జైలు నుంచే ఆ పని చేస్తున్నారని ఎద్దేవా చేశారు Devendra Fadnavis.
హనుమాన్ చాలీసా & లౌడ్ స్పీకర్ వివాదం
స్వతంత్ర ఎంపీ నవీనీత్ రాణా, ఆమె భర్త ఎమ్మెల్యే రవి రాణాను అరెస్టు చేయడంపై మహారాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. హనుమాన్ చాలీసా పఠిస్తే తమ ప్రభుత్వం అస్థిరమవుతుందా? అని ప్రశ్నించారు.అలాగే లౌడ్ స్పీకర్ల వివాదంపై కూడా గళమెత్తాడు. లౌడ్ స్పీకర్లను తొలగించడానికి భయపడుతున్న వ్యక్తులు బాబ్రీ మసీదును కూల్చివేసినట్లు చెప్పారని, ఆ సమయంలో పార్టీ ఉనికిలో లేదని విమర్శించారు.
రాణా దంపతులు రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచబోతున్నారని ఎంవీఏ ప్రభుత్వం కోర్టుకు ఏం తెలియజేసింది? మీరు రాముడి పక్షమా లేక రావణుడి పక్షమా? హనుమాన్ చాలీసా పారాయణ చేసి ఏ ప్రభుత్వమైనా కూలిపోతుందని భయపడ్డారా? అని ప్రశ్నించారు. మసీదుల నుంచి లౌడ్ స్పీకర్లను తొలగించడానికి భయపడే వాళ్లు బాబ్రీ మసీదును కూల్చివేశామని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. బాబ్రీ మసీదు కూల్చివేతలో దేవేంద్ర ఫడ్నవీస్ కూడా భాగమేనని.. అయితే అప్పుడు శివసేన నాయకుడు ఎవరూ కూడా అక్కడ లేరని ఎద్దేవా చేశారు. బాబ్రీని తాను మసీదుగా పరిగణించనని, అది కేవలం ఒక నిర్మాణమని Devendra Fadnavis వ్యాఖ్యానించారు.
ముంబైలోని సోమయ్య మైదానంలో బీజేపీ నిర్వహించిన 'బూస్టర్ డోస్' ర్యాలీకి హాజరయ్యేందుకు భారీగా జనం తరలివచ్చారు. ఈ ర్యాలీలో బీజేపీ జాతీయ కార్యదర్శి వినోద్ తావ్డే, కో-ఇన్‌ఛార్జ్ జైభన్ సింగ్ పవయ్య, మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్, బీజేపీ మంత్రులు ప్రవీణ్ దారేకర్, మంగళ్ ప్రభాత్ లోధా, గోపాల్ శెట్టి, మనోజ్ కోటక్, ఆశిష్ షెలార్, అతుల్ భత్ఖల్కర్ తదితరులు పాల్గొన్నారు.