
Bihar Politics: బీహార్ లో రాజకీయ సమీకరణాల శరవేగంగా మారుతున్నాయి. అనూహ్య పరిణామాల మధ్య నితీష్ కుమార్ సీఎం పదవికి రాజీనామా చేయడం. రాజీనామా లేఖను వెంటనే గవర్నర్‌కు అందించడం. అనంతరం..లాలూ ప్రసాద్ సతీమణి రబ్రీదేవి నివాసంలో కీలక సమావేశం నిర్వహించడం వంటి అనేక అనూష్య పరిమాణాలు చోటుచేసుకున్నాయి. మొత్తం మీద బీహార్ లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పాలి.
ఈ నేపథ్యంలో బీహార్ రాజకీయ పరిణామాలపై మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ స్పందించారు. ఎన్డీయే నుంచి వైదొలగాలని నితీశ్ కుమార్ తీసుకున్న నిర్ణయం జనతాదళ్ కుటుంబం కలిసి ఉన్న రోజులను గుర్తుచేస్తోందన్నారు. కొత్త తరం వారికి (జనతాదళ్)కి అద్భుతమైన అవకాశం ఉందని ఆయన అన్నారు. జనతాదళ్ నిశ్చయించుకుంటే..దేశంలో మరో గొప్ప ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగలదని అన్నారు.
ఆయన ట్వీట్ చేస్తూ... బీహార్‌లో జరుగుతున్న పరిణామాలను నేను గమనిస్తున్నాను. ఈ పరిణామం జనతాదళ్ కుటుంబమంతా కలిసి ఒకే తాటిపై కలిసి నడిచిన రోజులను గుర్తుకు చేస్తుంది. ఆ రోజుల గురించి మళ్లీ ఆలోచించేలా చేసింది. ఈ కుటుంబం దేశానికి ముగ్గురు పీఎంలను ఇచ్చింది. నేను నా వయస్సు రీత్యా చివరి దశలో ఉన్నాను. కానీ.. మీ యువతరం (జనతాదళ్) నిర్ణయిస్తే.. దేశానికి మరో రాజకీయ ప్రత్యామ్నాయాన్ని అందించగలదు అని పేర్కొన్నారు.
90వ దశకంలో జనతాదళ్ నుంచి మొత్తం ముగ్గురు ప్రధానులు అయ్యారు. జనతాదళ్ తొలి ప్రధాని వీపీ సింగ్ .. ఆయన 334 రోజులు దేశానికి ప్రధానిగా వ్యవహరించారు. అనంతరం జనతాదళ్ రెండో ప్రధానమంత్రిగా హెచ్‌డి దేవెగౌడ వ్యవహరించారు. ఆయన 324 రోజులు దేశానికి ప్రధానమంత్రిగా కొనసాగారు. ఆయన తర్వాత కొద్ది రోజులకే ఇందర్ కుమార్ గుజ్రాల్ ప్రధాని అయ్యారు. ఆయన 332 రోజుల పాటు దేశానికి ప్రధానిగా వ్యవహరించారు. వీరంతా జనతాదళ్ ప్రధానమంత్రులు.
హెచ్‌డి దేవెగౌడ ఎవరు?
హెచ్‌డి దేవెగౌడ.. ఆయన భారత మాజీ ప్రధాని. కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న దేవెగౌడ.. జనతాదళ్ ప్రభుత్వ గొప్ప నాయకులలో ఒకరు. 1996లో (13 రోజుల పాలన తరువాత) అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం పడిపోయిన తర్వాత కాంగ్రెస్ మద్దతుతో జనతాదళ్ ప్రభుత్వం ఏర్పాటైంది. మాజీ ప్రధాని వీపీ సింగ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టేందుకు నిరాకరించడంతో హెచ్‌డీ దేవెగౌడను ప్రధాని చేశారు. దేవెగౌడ దాదాపు ఏడాది పాటు దేశానికి ప్రధానిగా ఉన్నారు. అయితే జనతాదళ్‌లో చీలిక తర్వాత జనతాదళ్ సెక్యులర్ పేరుతో ప్రత్యేక పార్టీని స్థాపించారు.
నిజానికి నితీష్ కుమార్ కూడా జనతాదళ్ నాయకుడు. జార్జ్ ఫెర్నాండెజ్, నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్, శరద్ యాదవ్, రామ్ విలాస్ పాశ్వాన్ తదితరులు బీహార్ నుండి జనతాదళ్ లో గొప్ప పేరున్న నాయకులు. అయితే జనతాదళ్ నుంచి విడిపోయిన తర్వాత అందరూ వేర్వేరు పార్టీలు ఏర్పాటు చేసుకున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ రాష్ట్రీయ జనతాదళ్ ఏర్పాటు చేయగా.. జార్జ్ ఫెర్నాండెజ్, శరద్ యాదవ్, నితీష్ కుమార్ కలిసి సమతా పార్టీని స్థాపించారు. కానీ.. కొన్ని కారణాల వల్ల.. నితీష్ కుమార్, శరద్ యాదవ్ కలిసి జనతాదళ్ యునైటెడ్‌ను ఏర్పాటు చేశారు. మరోవైపు రామ్ విలాస్ పాశ్వాన్ లోక్ జనశక్తి పార్టీని స్థాపించారు.
నితీష్ కుమార్, లాలూ యాదవ్ కలయిక
నిజానికి ఈ నాయకులంతా సోషలిస్టు ఉద్యమం నుంచి వచ్చినవారే.. జెపి ఉద్యమం నుండి బయటకు వచ్చిన ఈ నాయకుల ఆదర్శాలు జెపి, లోహియా వంటి సోషలిస్టులు. అయితే నితీష్ కుమార్ చాలా కాలంగా బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్డీయేలో భాగస్వామ్యమయ్యారు. ఐదేళ్లలో రెండోసారి లాలూ ప్రసాద్ యాదవ్‌కు చెందిన ఆర్జేడీతో పొత్తు పెట్టుకుని నితీశ్ కుమార్ ఎన్డీయే నుంచి వైదొలిగారు.
నితీష్ కుమార్‌పై దేవెగౌడ ఆశలు ఎందుకు?
పాత తరం జనతాదళ్ నాయకుడైన నితీష్ కుమార్.. ఇప్పటికీ చాలా చురుకుగా, క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. నితీష్ కుమార్ దాదాపు 17 ఏళ్లుగా బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. అటువంటి పరిస్థితిలో.. కొత్త తరం సోషలిస్టు నాయకులకు ఆయన సరైన మార్గంలో తీసుకెళ్తే.. ఆయన జాతీయ రాజకీయాల్లో తిరుగులేని సోషలిస్టు అవుతాడనేది దేవెగౌడ అభిప్రాయమని రాజకీయ విశ్లేషకుల టాక్ .
బీహార్‌లో బీజేపీకి ఎదురు దెబ్బ
బీహార్‌లో ఎదురుదెబ్బ తగిలింది. నిజానికి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న తర్వాత కూడా బీజేపీ తన కూటమి భాగస్వామి నితీష్ కుమార్‌ను ముఖ్యమంత్రిని చేసింది. నితీష్ కుమార్ ఏడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే.. ఈలోగా సంస్థాగత మరియు ఎన్నికల సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని.. బిజెపి తనను తాను బలోపేతం చేసుకోవడంలో నిమగ్నమై ఉంది. మహారాష్ట్రలో శివసేన మాదిరిగానే.. జేడీయూను తయారు చేసేందుకు పక్కా ప్రణాళిక రచించిందని అంతా భావించారు. కానీ రాజకీయ అనుభవం లేని ఉద్ధవ్ ఠాక్రేలా కాకుండా, అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు నితీష్ కుమార్ బీజేపీకి గట్టి షాక్ ఇచ్చాడు.
ఎనిమిదోసారి సీఎంగా నితీష్ కుమార్
మంగళవారం జరిగిన జేడీయూ ఎమ్మెల్యేలు, ఎంపీల సమావేశంలో ఎన్డీయేతో తెగదెంపులు చేసుకోవాలని నితీశ్ కుమార్ ఏకగ్రీవంగా నిర్ణయించారు. అనంతరం.. ఆయన తన రాజీనామా లేఖను రాజ్‌భవన్‌కు వెళ్లి సమర్పించారు. మరోవైపు, తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ, కాంగ్రెస్ సహా ఏడు పార్టీల ఎమ్మెల్యేలు సమావేశమై.. ఎన్డీయే నుంచి వైదొలిగిన నితీష్ కుమార్‌కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించు కున్నాయి. అనతికాలంలోనే నితీష్ శాసనసభా పక్ష నేతగా ఎన్నికయ్యారు. నితీష్ కు మద్దతు ఇచ్చే పార్టీ నేతలు గవర్నర్‌ను కలిసి.. తమ మద్దతును నితీష్ కుమార్ ఇస్తుమని తెలిపారు. 164 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖలు ఇచ్చి ప్రభుత్వ ఏర్పాటుకు చేయాలని కోరారు.