
అస్సాంలో తుఫాను విధ్వంసం సృష్టిస్తోంది. పలు జిల్లాల్లో కురిసిన ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన భారీ వర్షాల వల్ల ఇప్పటి వరకు దాదాపుగా 14 మంది మరణించారు. ఈ వివరాలను అధికారులు ఆదివారం వెల్లడించారు. ఇక్కడ మరింత వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ వర్షాల వల్ల రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో కూడా పలువురు చనిపోయారు.
తుఫాను కారణంగా దిబ్రూగఢ్, బర్పేట, కమ్రూప్ (మెట్రో), కమ్రూప్ (రూరల్), నల్బరి, చిరాంగ్, దర్రాంగ్, కాచర్, గోలాఘాట్, కర్బీ అంగ్లాంగ్, ఉదల్‌గురి, గోల్‌పరా జిల్లాల్లో అనేక చెట్లు, అనేక విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. వీటి వల్ల 7,400 ఇళ్లు దెబ్బతిన్నాయి.
“ భారీ తుఫాను కారణంగా శుక్రవారం సాయంత్రం దిబ్రూగఢ్ జిల్లాలోని టింగ్‌కాంగ్ రెవెన్యూ గ్రామంలో ఉరుములతో కూడిన వర్షం కురిసింది, దీని వల్ల ఆ ప్రాంతంలో చెట్లు నేలకొరిగాయి. ఈ ప్రమాదాల్లో నలుగురు మరణించారు” అని అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ASDMA) దిబ్రూగఢ్ జిల్లా ప్రాజెక్ట్ ఆఫీసర్ దీప్జ్యోతి హటికాకోటి తెలిపారు.
అస్సాంలోని డిమా హసావో జిల్లాలోని కెల్లోలో గ్రామ సమీపంలో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో అనేక వాహనాలు జాతీయ రహదారి 54Eపై నిలిచిపోయాయి. జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి పలు వాహనాలు బురదలో కూరుకుపోయాయి. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కొండ జిల్లాలో భారీగా కొండచరియలు విరిగిపడుతున్నాయి.
కొండచరియలు విరిగిపడటంతో రోడ్డులోని పలు ప్రాంతాలు దెబ్బతినడంతో ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. అయితే మరోవైపు, NHAI మరియు జిల్లా యంత్రాంగం రోడ్డు, చెత్తను తొలగించే పనిలో నిమగ్నమయ్యాయి. గత ఏడాది కూడా వర్షాకాలంలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా.. అస్సాం, మేఘాలయలో కొన్ని చోట్ల భారీ వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.
అసోంలో వర్షాలు, తుపాను కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాని ట్వీట్ చేశారు.