
బెంగళూరు: ఇప్పుడు సోషల్ మీడియా దైనందిన జీవితంలో భాగం అయిపోయింది. అందులో ఏది పోస్టు చేసినా అందరి నుంచి స్పందనలు పొందుతున్నది. ఈ పోస్టులు అందరి నుంచి హర్షాతిరేకాలు పొందితే సమస్య ఏమీ లేదు. కానీ, ప్రత్యేకంగా ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ పోస్టు చేస్తే మాత్రం ఘర్షణలకూ దారి తీస్తున్నది. కర్ణాటకలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ముస్లింలను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ఓ వ్యక్తి పోస్టు చేశాడు. దానిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ముస్లిం కమ్యూనిటీ నుంచి ఫిర్యాదు వచ్చింది. ఈ
ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. సదరు వ్యక్తిని అరెస్టు చేశారు. పోలీసులు తీసుకున్న చర్యలతో సంతృప్తి పొందని ఫిర్యాదు చేసిన వర్గం పోలీసు స్టేషన్ ఎదుట గుమిగూడింది. రాళ్లతో విరుచుకుపడింది.
ఈ రాళ్ల దాడిలో కనీసం 12 మంది పోలీసులు గాయపడ్డారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నది. పోలీసు స్టేషన్‌పై రాళ్లు రువ్వగానే పోలీసులూ అప్రమత్తం అయ్యారు. వెంటనే బయటకు వచ్చి స్వల్పంగా లాఠీ చార్జ్ చేశారు. గుంపును చెదరగొట్టడానికి టియర్ గ్యాస్ ప్రయోగించారు.
పోలీసు స్టేషన్‌పై దాడులకు సంబంధించి ఆరు కేసులు నమోదు చేసినట్టు హుబ్లీ ధార్వాడ్ పోలీసు కమిషనర్ లాభు రామ్ వెల్లడించారు. ఈ కేసుల్లో 46 మంది నిందితులను అరెస్టు చేసినట్టు వివరించారు. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని తెలిపారు. నిన్న రోజు రాత్రి పెద్ద మొత్తంలో పోలీసు స్టేషన్ ఎదుట గుమిగూడారని వివరించారు. దాడులకు దిగారని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తాము అన్ని చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.
ఈ ఘటనపై కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై సీరియస్ అయ్యారు. ఇలాంటి ఘటనలను సహించబోమని వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా సరే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునేవారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి తమ పోలీసులు వెనుకాడబోరని స్పష్టంగా చెప్పదలిచానని పేర్కొన్నారు. వారు ఎవరైనా సరే.. ఈ మూకను రెచ్చగొట్టి పోలీసు స్టేషన్‌పై దాడికి ఉసిగొల్పిన సంస్థలపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇలాంటి అల్లర్ల వెనుక ఉండే సంస్థలపై చర్యలు తప్పవని తాను స్పష్టంగా చెప్పదలిచినట్టు వివరించారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోరాదని హెచ్చరించారు. కర్ణాటక ప్రభుత్వం ఇలాంటి చర్యలను ఉపేక్షించదని అన్నారు.
ఢిల్లీలోని జహంగీర్‌పురి ప్రాంతంలో శనివారం రాత్రి చేపట్టిన హనుమాన్ జయంతి శోభాయాత్రలో ఘర్షణలు జరిగాయి. ఓ వర్గం ఈ ర్యాలీపై రాళ్లు రువ్వడంతో ఇది చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో ఆరుగురు పోలీసు సిబ్బంది, ఓ పౌరుడికి గాయాలు అయ్యాయి. ఈ వివరాలను పోలీసు వర్గాలు వెల్లడించాయి.
గాయపడిన వారిలో ఢిల్లీ పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ మేధలాల్ మీనా కూడా ఉన్నారు. ఆయన చేతికి బుల్లెట్ గాయమైంది. అయితే ఆయనని ఎవరు కాల్చారు ? ఎలా కాల్చారు అనే వివరాలు ఇంకా తెలియరాలేదు. రాళ్లదాడి, హింసాత్మక ఘటనలకు సంబంధించి 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియాలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలు, వీడియోలను ఉపయోగించి మరింత మంది అనుమానితులను గుర్తించామని, వారిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పోలీసు వర్గాలు తెలిపాయి.
అల్లర్లు, హత్యాయత్నం, ఆయుధ చట్టం సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై దర్యాప్తు చేసేందుకు క్రైమ్ బ్రాంచ్, స్పెషల్ సెల్ అధికారులు పది బృందాలను ఏర్పాటు చేశారు.హింసకు సంబంధించిన ప్రాథమిక విచారణ కుట్ర కోణంలో ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి.