
యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అక్రమంగా నిర్మాణాల కూల్చివేతపై దృష్టి సారించింది. దీంతో అక్రమంగా ఇళ్లు నిర్మించుకొని జీవిస్తున్నవారు ఆందోళన చెందుతున్నారు. గతంలో నేరస్తులు తమను ఎన్ కౌంటర్ చేయొద్దంటూ ప్లకార్డులు పట్టుకొని పోలీస్ స్టేషన్లలో లొంగిపోయిన విధంగానే ఆక్రమ ఆస్తులు ఉన్న వారు కూడా ముందుకొస్తున్నారు. అక్రమంగా కట్టిన ఆస్తులను కూల్చివేయాలని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు.
తాజాగా యూపీ రాంపూర్ జిల్లాలోని షహాబాద్ తహసీల్ పరిధిలోని మిత్రాపూర్ ఎహ్రోలా గ్రామానికి చెందిన ఎహ్సాన్ మియాన్ అనే వ్యక్తి ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాడు. ప్రభుత్వం బుల్‌డోజింగ్ చర్యకు భయపడి అక్రమంగా నిర్మించిన తన సొంత ఇంటిని పడగొట్టమని SDM అశోక్ చౌదరిని విజ్ఞప్తి చేశాడు.
అయితే ఎహ్సాన్ మియాన్ వాదన నిజమేనని అధికారులు ప్రాథమిక విచారణలో తేల్చారు. అతడి ఇళ్లు కొంత భాగం ఎండిపోయిన చెరువపై అలాగే కొంత భాగం స్మశాన వాటికపై నిర్మించి ఉందని తేలింది. ఈ రెండు ఆస్తులు ప్రభుత్వానికి, వక్ఫ్ బోర్డుకు చెందినవి. ఈ దరఖాస్తు సందర్బంగా ఎహ్సాన్ మియాన్ మాట్లాడుతూ.. “ మేము దాదాపు రెండు తరాలుగా ఈ ఇంట్లోనే ఉన్నాము. మా ప్లాట్ మ్యాప్‌లో వక్ఫ్, ప్రభుత్వ ఆస్తులపై అక్రమంగా ఇల్లు నిర్మించి ఉందని నాకు ఇటీవలే తెలిసింది. కాబట్టి నేను దానిని కూల్చివేయడానికి దరఖాస్తును దాఖలు చేయాలని నిర్ణయించుకున్నాను. ’’ అని అన్నారు.
ఈ విషయంలో SDM అశోక్ చౌదరి మాట్లాడుతూ.. “ రాంపూర్ జిల్లా తహసీల్ షహాబాద్ పరిధిలోని మిత్రాపూర్ ఎహ్రోలా గ్రామంలో అనేక గృహాలు ఎండిపోయిన చెరువులు, స్మశానవాటికలపై నిర్మించబడి ఉన్నాయి. గ్రామంలో సర్వే నిర్వహించిన తర్వాత అలాంటి భూమిలో నిర్మాణాలు ఉంచలేమని అధికార యంత్రంగా నిర్ణయించింది. మేము ఇప్పుడు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. త్వరలోనే అక్కడ నివాసం ఉండే వారికి అధికారికంగా నోటీసులు పంపుతాం’’ అని ఆయన తెలిపారు.
షహాబాద్ తహసీల్దార్ దినేష్ కుమార్ మాట్లాడుతూ.. “ ఈ గ్రామం 200 హెక్టార్లలో విస్తరించి ఉంది. 50 ఏళ్లకు పైగా ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. SDM సమాచారాన్ని మాకు అందించారు. ప్రభుత్వ భూమిని ఖాళీ చేయించడానికి అధికార యంత్రాంగం తగిన చర్యలు తీసుకుంటుంది. ఈ ప్రక్రియలో దాదాపు 50 కుటుంబాలు ప్రభావితం కావచ్చు. ఇందులో కొన్ని పేద కుటుంబాలు కూడా ఉన్నాయి. అయితే వారికి ఇళ్లు నిర్మించుకోవడానికి భూమి అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కాగా ఎహ్సాన్ మియాన్ తన అక్రమ ఇంటిని కూల్చివేయాలని ప్రభుత్వానికి స్వచ్ఛందంగా దరఖాస్తు చేయడం ఆ గ్రామంలో నివాసం ఉండే అనేక మందికి కోపం తెప్పించింది. దీంతో వారంతా అతడిపై ఆగ్రహంగా ఉన్నారు. వారి నుంచి తనను రక్షించాలని ప్రభుత్వాన్ని సాయం కోరాడు. తనకు రక్షణ కావాలని స్థానిక అధికారులను అభ్యర్థించాడు.
ఇదిలా ఉండగా యూపీలో యోగి ఆధిత్యనాథ్ ఆధ్వర్యంలో బీజేపీ రెండో సారి అధికారం చేపట్టింది. బీజేపీ సొంతంగా పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో యోగి ఆదిత్యనాథ్ తన ప్రసంగాల్లో అక్రమార్కులపై దృఢమైన చర్యలు తీసుకుంటానని, అక్రమంగా నిర్మించిన ఆస్తులపై బుల్డోజర్లను నడుపుతానని పదే పదే వ్యాఖ్యానించారు.