
మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. రోడ్డు మీద జరిగిన తగాదా ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. వివరాల్లోకి వెళితే.. సిద్ధార్థ్ సోని (32) ఇండోర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో ఆర్కిటెక్టుగా పనిచేస్తున్నాడు.
ఈ క్రమంలో గురువారం విధులు ముగించుకుని కారులో ఇంటికి బయల్దేరాడు. అయితే పలాసియా ఏరియా పరిసర ప్రాంతాల్లో సిద్ధార్ధ్ కారు, స్కూటర్ మీద వెళ్తున్న వికాస్ యాదవ్ అనే వాహనదారుడిని ఢీకొట్టింది.
జరిగిన దానికి తన వంతు బాధ్యతగా కారు దిగి సిద్ధార్థ్, వికాస్‌కు క్షమాపణలు చెప్పాడు. కానీ వికాస్ మాత్రం అతనిని మన్నించే పరిస్ధితుల్లో లేకపోగా.. ఇంకా ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసభ్య పదజాలంతో సిద్ధార్ద్‌ను దూషించడం మొదలుపెట్టాడు.
దీంతో మాటా మాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో వికాస్, సిద్ధార్థ్‌ను బలంగా నెట్టివేశాడు. దీంతో అతను అటుగా వస్తున్న ట్రక్కు చక్రాల కింద పడి నలిగిపోయాడు. దీనిని అస్సలు ఊహించని వికాస్ అక్కడి నుంచి పరారయ్యాడు.
సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా వికాస్‌తో పాటు ట్రక్కు డ్రైవర్‌ను అరెస్టు చేశారు. అనంతరం ఇద్దరిపై హత్యానేరం కింద అభియోగాలు నమోదు చేశారు.
కాగా సిద్ధార్ద్‌కు ఏడాది క్రితమే పెళ్లయ్యింది. మరో నాలుగు రోజుల్లోనే ఆయన మొదటి వివాహ వార్షికోత్సవం జరుపుకోనున్నారు. అంతలోనే ఈ దారుణం జరిగిపోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.