
ముంబై:శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేతో బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమావేశమైన తర్వాత కూడ శివసేన నిర్ణయంలో ఎలాంటి మార్పులేదని ప్రకటించింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని శివసేన గురువారం నాడు ప్రకటించింది.
శివసేనను బుజ్జగించేందుకు గాను బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా జూన్ 6 వతేదిన ఆ పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశమయ్యారు. రెండు గంటలపాటు వీరిద్దరి మధ్య చర్చలు జరిగాయి. అయితే ఈ చర్చల నేపథ్యంలో రెండు పార్టీ మధ్య మళ్ళీ మంచి వాతావరణం నెలకొనే అవకాశం ఉందని భావించారు.
కానీ బిజెపి ఆశలను శివసేన నీరుగార్చింది. గురువారం నాడు ఆ పార్టీ అధికార ప్రతినిధి సంజయ్ రావత్ బాంబు పేల్చారు.2019 ఎన్నికల్లో శివసేన ఒంటరగానే పోటీ చేస్తోందని ఆయన ప్రకటించారు.అన్ని ఎన్నికల్లోనూ ఒంటరిగానే పోటీ చేయాలని పార్టీ జాతీయ కార్యవర్గం తీర్మాణం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పార్టీకి సంబంధం లేని వ్యక్తులు వచ్చి ఆ నిర్ణయాన్ని ఎలా ప్రభావితం చేస్తారని సంజయ్ రావత్ ప్రశ్నించారు.
అమిత్ షా ఎందుకు వచ్చారో తనకు తెలుసునని ఆయన చెప్పారు. శివసేన తీర్మానాన్ని మార్చుకొనే ప్రసక్తే లేదని ప్రకటించారు. పాల్ఘార్ పార్లమెంట్ స్థానానికి జరిగిన ఎన్నికల్లో శివసేనపై స్వల్ప మెజారిటీతో బిజెపి విజయం సాధించింది. కౌంటింగ్ రోజున మోడీతో పాటు బిజెపి నేతలపై శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే అదే రోజున శివసేన ఎన్డీఏ నుండి బయటకు వస్తోందనే ప్రచారం కూడ సాగింది. ఈ తరుణంలోనే మితరపక్షాలను బుజ్జగించేందుకుగాను అమిత్ షా మిత్రపక్షాల నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇందులో భాగంగానే అమిత్ షా ఉద్దవ్ ఠాక్రేతో సమావేశమయ్యారు.