
pollution: మానవచర్యల కారణంగా భూ వాతావరణంలో తీవ్రమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా అడవుల నరికివేత, ప్లాస్టిక్, కర్బన ఉద్గారాలను విడుదల చేసే వాహనాలు, వస్తువుల వినియోగం గణనీయంగా పెరడగంతో వాతావరణ కాలుష్యం అధికమవుతున్నదని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే.. మానవాళితో పాటు భూమి మీద జీవిస్తున్న అనేక జీవజాతుల మనుగడ ప్రమాదంలో పడుతుందని హెచ్చరిస్తున్నాయి. ఈ క్రమంలోనే కరోనా మహమ్మారి కారణంగా లాక్‌డౌన్ విధించిన సమయంలోనూ గాలి కాలుష్యం గణనీయంగా పెరిగిందని తాజా అధ్యయనం వెల్లడించింది. కార్బన్ అధికంగా ఉండే చిన్న కణాల బయోమాస్ ఉద్గారాలు, ధూలి కణాల ప్రవాహమే ఈ కాలుష్యాన్ని ప్రాథమిక కారణాలుగా ఉన్నాయని తెలిపింది.
వివరాల్లోకెళ్తే.. చైనాలో వెలుగులుచూసిన కరోనా మహమ్మారి తక్కువ కాలంలోనే యావత్ ప్రపంచ దేశాలకు వ్యాపించి అతిపెద్ద సంక్షోభాన్ని సృష్టించింది. ఇప్పటికీ పలు దేశాల్లో తీవ్ర ప్రభావం చూపుతోంది. భారత్ లోనూ లక్షల మంది ప్రాణాలు తీసుకున్న కోవిడ్-19.. కోట్లాది మందిని తీవ్ర అనారోగ్యానికి గురిచేసింది. ఇక కోవిడ్-19 సెకండ్ వేవ్ సమయంలో భారత్ లో మరణమృదంగం మోగించింది. నిత్యం వేలాది మంది చనిపోయారు. ఈ సంక్షోభ సమయంలో కరోనాతో పాటు గాలి కాలుష్యం కూడా మానవ జీవితాలపై తీవ్ర ప్రభావం చూపింది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా విధించిన లాక్ డౌన్ సమయంలో దేశంలో గాలి కాలుష్యం గణనీయంగా పెరిగిందని తాజా నివేదికలు పేర్కొంటున్నాయి. రెండవ కోవిడ్ -19 సెకండవేవ్ మానవ జీవితాన్ని అపూర్వమైన వినాశనానికి గురిచేయడమే కాకుండా మార్చి-మే 2021 మధ్య లాక్‌డౌన్ ఉన్నప్పటికీ ఢిల్లీతో పాటు దేశంలోని చాలా ప్రాంతాల్లో వాయు కాలుష్యం గణనీయంగా పెరిగింది.
SAFAR ప్రచురించిన 'కెమోస్పియర్' జర్నల్‌లోని అధ్యయనం ప్రకారం, కార్బన్ అధికంగా ఉండే చిన్న కణాల బయోమాస్ ఉద్గారాలు, సుదూర ధూళి వేగవంతమైన ప్రవాహమే కాలుష్యానికి ప్రాథమిక కారణాలని నిపుణులు కనుగొన్నారు. ఈ అధ్యయనం ప్రకారం లాక్‌డౌన్ ఉద్గారాలను తగ్గించినందున, ఏప్రిల్‌లో ఒక రోజులో PM2.5 ఒక క్యూబిక్ మీటర్‌కు 30-40 మైక్రోగ్రాములు ఉండాలి. లాక్ డౌన్ లేకుంటే, PM2.5 75-85 మైక్రోగ్రాములుగా ఉండేది. అయితే, ఏప్రిల్‌లో రోజుకు PM2.5 సాంద్రత క్యూబిక్ మీటరుకు 100-125 మైక్రోగ్రాములకు పెరిగింది. "సాధారణ ఉద్గారాల కంటే ఎక్కువ ఉద్గారాల భారంలో అదనపు పెరుగుదల PM2.5 గాఢతలో దాదాపు 30-40% పెరుగుదలకు దారితీసింది" అని SAFAR వ్యవస్థాపక ప్రాజెక్ట్ డైరెక్టర్, అధ్యయనం ప్రధాన రచయిత గుఫ్రాన్ బేగ్ చెప్పారు.
కోవిడ్-19 లాక్‌డౌన్ (ఏప్రిల్-మే 2021) రెండవ వేవ్ సమయంలో ఢిల్లీ అధిక కాలుష్య స్థాయిలను చూసింది. ఆ సమయంలో దేశంరాజధాని ఢిల్లీతో పాటు చాలా ప్రాంతాల్లో కోవిడ్ మరణాల మృతదేహాలతో శ్మశానవాటికలు నిండిపోయాయి. ఢిల్లీలో ఏకంగా జంతువుల శ్మశాన వాటికల్లో మనుషుల మృతదేహాల అంత్యక్రియలు నిర్వహించారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉంతో అర్థమవుతుంది. భారీ ఎత్తున శవాలను కాల్చడం, శ్మశానాల నుండి విడుదలయ్యే సేంద్రీయ కార్బన్‌తో కూడిన చిన్న రేణువులతో మరియు ధూళి కణాల అధిక ప్రవాహం గాలి కాలుష్యం మరింగా పెరిగేందుకు కారణమయ్యాయని ఈ నివేదిక తెలిపింది.