
Delhi BJP stages protest: దేశరాజధాని ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకులు, కార్యకర్తలు ఆమ్ ఆద్మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలకు దిగింది. ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. దీంతో ఆప్ ప్రధాన కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
వివరాల్లోకెళ్తే.. కేజ్రీవాల్ ప్రభుత్వానికి చెందిన ఫీడ్ బ్యాక్ యూనిట్ (ఎఫ్ బీయూ)కు సంబంధించిన గూఢచర్యం ఆరోపణల నేపథ్యంలో ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ బీజేపీ గురువారం డీడీయూ మార్గ్ లోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రధాన కార్యాలయం వద్ద భారీ ప్రదర్శన నిర్వహించింది. ఢిల్లీ ప్రభుత్వ విభాగం ద్వారా 'పొలిటికల్ ఇంటెలిజెన్స్' అక్రమంగా సేకరించిన ఆరోపణలపై సీబీఐకి ప్రాసిక్యూషన్ కు అనుమతి ఇవ్వడం ద్వారా సిసోడియాపై కేసు నమోదుకు కేంద్రం మార్గం సుగమం చేసింది.
ఎఫ్ బీయూ ఏర్పాటుతో జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఢిల్లీ బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ వీరేంద్ర సచ్ దేవ్, పార్టీ ఎంపీలు మనోజ్ తివారీ, పర్వేష్ వర్మ ఆరోపించారు. ఫీడ్ బ్యాక్ యూనిట్ నేరుగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు నివేదించిందనీ, ఆప్ రాజకీయ ప్రత్యర్థులు, మీడియా సంస్థలు, వ్యాపార సంస్థల సమాచారాన్ని సేకరించాలని ఆదేశించినట్లు సచ్ దేవ్ తెలిపారు.
సిసోడియాను ఉపముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అవినీతిని అరికట్టడానికి ఆప్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎఫ్బీయూ నిబంధనలకు విరుద్ధంగా 'పొలిటికల్ ఇంటెలిజెన్స్'ను సేకరించిందని తమ ప్రాథమిక విచారణలో తేలిందనీ, ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఏజెన్సీ సిఫార్సు చేసిన నేపథ్యంలో సిసోడియా ప్రాసిక్యూషన్ కు అనుమతి లభించింది.
ఈ పరిణామంపై స్పందించిన సిసోడియా తనపై ప్రాసిక్యూషన్ అనుమతిని పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ప్రత్యర్థులపై తప్పుడు కేసులు బనాయించడమే బలహీన, పిరికితనానికి నిదర్శనమని ట్విటర్ లో పేర్కొన్నారు. ఆప్ ఎంతగా ఎదుగుతుందో అంతగా తమపై కేసులు పెడతారని ఆయన ట్వీట్ చేశారు. ఇప్పుడు రద్దు చేసిన 2021-22 ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో మద్యం వ్యాపారులకు అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలపై సిసోడియా ఇప్పటికే సీబీఐ కేసును ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఆయన ఈ నెల 26న విచారణకు హాజరు కావాల్సి ఉంది.