
Law Against Love Jihad: శ్రద్ధా వాకర్ హత్య కేసు, తునీషా శర్మ ఆత్మహత్య కేసు తర్వాత, మహారాష్ట్రలో లవ్ జిహాద్ చట్టం చేయాలనే డిమాండ్ వేగంగా పెరుగుతోంది. లవ్ జిహాద్ చట్టాన్ని అమలు చేయాలని బీజేపీ ఎమ్మెల్యే నితీష్ రాణే బుధవారం మహారాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నితీష్ రాణేతో పాటు మహిళా ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌లను కలిసి గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్ తరహాలో మతమార్పిడి నిరోధక చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు.
లవ్ జిహాద్ చట్టాన్ని అమలు చేస్తామని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వారం రోజుల క్రితమే సూచనప్రాయంగా వెల్లడించారు. రాష్ట్రంలో లవ్ జిహాద్ కేసులు పెరుగుతున్నాయని ఫడ్నవీస్ అన్నారు. ఇతర రాష్ట్రాల్లో చేసిన చట్టాలను ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని తెలిపారు. మహిళల ప్రయోజనాల కోసం మహారాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుందని వెల్లడించారు. అయితే, శివసేన-బీజేపీ ప్రభుత్వం మతాంతర వివాహాలకు వ్యతిరేకం కాదని దేవేంద్ర ఫడ్నవీస్ స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ తరహాలో మహారాష్ట్రలో లవ్ జిహాద్, మత మార్పిడికి వ్యతిరేకంగా చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ సకల్ హిందూ సమాజ్ మహిళా ప్రతినిధులతో కలిసి రాణే సీఎం షిండే, డిప్యూటీ సీఎం ఫడ్నవీస్‌లను కలిశారు.
లవ్ జిహాద్ చట్టం కోసం ముందడుగు...
లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా కఠిన చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తూ అనేక సంస్థలు మహారాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు చేపడుతున్నాయని బీజేపీ ఎమ్మెల్యే నితీష్ రాణే వార్తా సంస్థ ఏఎన్ఐతో మాట్లాడుతూ అన్నారు. మహిళా ప్రతినిధి బృందంతో కలిసి సీఎం ఏక్‌నాథ్ షిండే , డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌లను కలిశామనీ లవ్ జిహాద్‌తోపాటు మతమార్పిడి నిరోధక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశామన్నారు.
రానున్న నెలల్లో లవ్ జిహాద్ వ్యతిరేక చట్టం..
లవ్ జిహాద్, మత మార్పిడి నిరోధక చట్టం తీసుకురావాలనే డిమాండ్‌పై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, ఉపముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్‌లు సానుకూలంగా స్పందించారని నితేశ్ రాణే తెలిపారు. రాబోయే కొద్ది నెలల్లో కఠినమైన చట్టం చేయవచ్చని ఇది సూచనని ఆయన అన్నారు. లవ్ జిహాద్ చట్టానికి సంబంధించిన ప్రశ్నకు ఫడ్నవీస్ కొద్దిరోజుల క్రితం మేము ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదనీ, కానీ ఇతర రాష్ట్రాల్లో చేసిన చట్టాలను అధ్యయనం చేస్తున్నామని చెప్పారు.
తునీషా శర్మ ఆత్మహత్య కేసును లవ్ జిహాద్‌తో పోల్చారు..
తునీషా శర్మ ఆత్మహత్య తర్వాత మహారాష్ట్ర రాజకీయాల్లో లవ్ జిహాద్ చట్టంపై చర్చ జోరందుకుంది. తునీషా మరణం లవ్ జిహాద్ అని మహారాష్ట్ర మంత్రి, బీజేపీ నాయకుడు గిరీష్ మహాజన్ పేర్కొన్నారు. షిండే నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం దీనికి వ్యతిరేకంగా కఠినమైన చట్టం తీసుకురావాలని ఆలోచిస్తోంది. దీనిపై లవ్ జిహాద్ కోణంలో కూడా దర్యాప్తు చేయాలని బీజేపీ ఎమ్మెల్యే అతుల్ భత్ఖల్కర్ పోలీసులను డిమాండ్ చేశారు. అదే సమయంలో, తృణమూల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి సాకేత్ గోఖలే మాట్లాడుతూ, రైట్‌వింగ్ పార్టీ తన రాజకీయ ఎజెండాను కొనసాగించడానికి తునీషా మరణాన్ని ఉపయోగించుకుంటుందని అన్నారు.