
జార్ఖండ్‌లో ఘోరం జరిగింది. గిరిధ్ జిల్లాలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో మూడు రోజుల పసికందును ఎలుకలు కొరికాయి. ఇప్పుడు ఆ చిన్నారి పరిస్థితి విషమంగా మారింది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క సారిగా సంచలనం సృష్టించింది. దీంతో ఇద్దరు నర్సులను ప్రభుత్వం విధుల్లో నుంచి తొలగించింది. దీనిపై దర్యాప్తు చేయడానికి ఒక ప్యానెల్ ను ఏర్పాటు చేసింది.
ఈ దిగ్భ్రాంతికరమైన ఘటన మే 2వ తేదీన గిరిధ్ సదర్ ఆసుపత్రిలో జరిగింది. ఆ నవజాత బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో ధన్‌బాద్‌లోని షాహిద్ నిర్మల్ మహ్తో మెడికల్ కాలేజీ హాస్పిటల్ (SNMMCH) కు తరలించారు. ప్రస్తుతం శిశువు పరిస్థితి నిలకడగా ఉందని SNMMCH వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై తల్లి మమతా దేవి మాట్లాడుతూ.. గిరిధి ఆసుపత్రిలోని మోడల్ మాతా శిశు ఆరోగ్య (MCH) వార్డులో తన బిడ్డను చూడటానికి వెళ్లినప్పుడు పాప మోకాలిపై ఎలుకలు కొరకడం వల్ల లోతైన గాయాలు కనిపించాయని తెలిపారు.
బాధిత శిశువు ఏప్రిల్ 29వ తేదీన జన్మించింది. అయితే ఆమె పుట్టిన తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడింది. దీంతో ఆ పాపను MCHలో చేర్చారు. ఈ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై జిల్లా యంత్రాంగం విచారణకు ఆదేశించిందని, డ్యూటీలో ఉన్న వైద్యుడిపై చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ విషయంలో SNMMCH పీడియాట్రిక్స్ విభాగం అధిపతి అవినాష్ కుమార్ మీడియాతో మాట్లాడారు. శిశువు మోకాలిపై గాయం ఉందని తెలిపారు. ఒక సర్జన్ పాపను జాగ్రత్తగా చూసుకునేందుకు కేటాయించామని చెప్పారు. అయితే ఆ గాయాలు ఎలుక కొరకడం వల్లే అయ్యాయని తాను స్పష్టంగా చెప్పలేనని, అలాగని కాదని కూడా చెప్పలేనని అన్నారు.
కాగా గిరిధ్ సదర్ హాస్పిటల్ లో డ్యూటీలో ఉన్న డాక్టర్ పై చర్యలు తీసుకోవాలని జార్ఖండ్ ఆరోగ్య శాఖ అదనపు చీఫ్ సెక్రటరీకి లేఖ పంపినట్లు గిరిదిహ్ డిప్యూటీ కమిషనర్ నమన్ ప్రియేష్ లక్రా తెలిపారు. ఆ ఆసుపత్రిలోని ఇద్దరు ఔట్ సోర్సింగ్ జీఎన్ఎంల (జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ) సిబ్బంది సేవలను రద్దు చేశామని చెప్పారు. నవజాత శిశువు ఉన్న వార్డు స్వీపర్ను తొలగించామని, ఏఎన్ఎంను సస్పెండ్ చేసినట్లు లక్రా తెలిపారు.
శిశువు కుటుంబ సభ్యుల ఫిర్యాదుల మేరకు ఈ ఘటనపై దర్యాప్తు చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు గిరిధ్ సివిల్ సర్జన్ ఎస్పీ మిశ్రా తెలిపారు. కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆసుపత్రి నర్సింగ్ సిబ్బంది దోషులుగా తేలితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ ఘటన తీవ్రమైనదని, సిబ్బంది నిర్లక్ష్యాన్ని తెలియజేస్తుందని ఆయన తెలిపారు.