
న్యూఢిల్లీ: ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపింది. మధుర రోడ్డులోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు బుధవారం బాంబు బెదిరింపు వచ్చినట్టుగా సంబంధిత వర్గాలు తెలిపాయి. పాఠశాలలో బాంబు పెట్టినట్లు ఈమెయిల్ ద్వారా సమాచారం అందింది. బాంబు బెదిరింపు సమాచారం అందినవెంటనే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ క్యాంపస్‌లో భయాందోళనలు చోటుచేసుకున్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాల ఆవరణ నుండి బయటకు తీసుకురావడానికి పాఠశాలకు చేరుకున్నారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు చేరుకుని విచారణ చేపట్టారు. పాఠశాల ఆవరణలో ఎలాంటి అనుమానాస్పద వస్తువు కనిపించలేదు ఢిల్లీ సౌత్ ఈస్ట్ డీసీసీ రాజేష్ డియో తెలిపారు. ‘‘ఇప్పటివరకు పాఠశాల ఆవరణలో ఎటువంటి అనుమానాస్పద వస్తువు కనుగొనబడనందున ఎటువంటి ముప్పు లేదు. పరిస్థితి సాధారణంగా ఉంది. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, ఎస్‌డబ్ల్యూఏటీ టీమ్ పాఠశాల భవనాలను శోధిస్తున్నాయి’’ అని రాజేష్ డియో చెప్పారు.