ఢిల్లీ: ఆ రైతు ఇలా మరణించాడు.. పోలీసుల వీడియో వైరల్

By Siva KodatiFirst Published Jan 26, 2021, 9:30 PM IST
Highlights

కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ రెండు నెలలుగా శాంతియుతంగా నిరసన చేస్తున్న రైతుల ఆగ్రహం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది.  ట్రాక్టర్ల ర్యాలీలో భాగంగా హింసాత్మక ఘటనలు జరగడంతో ప్రభుత్వ వర్గాలు ఉలిక్కిపడ్డాయి. 

కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ రెండు నెలలుగా శాంతియుతంగా నిరసన చేస్తున్న రైతుల ఆగ్రహం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది.  

ట్రాక్టర్ల ర్యాలీలో భాగంగా హింసాత్మక ఘటనలు జరగడంతో ప్రభుత్వ వర్గాలు ఉలిక్కిపడ్డాయి. ప్రభుత్వ ఆస్తులపై దాడి చేయడంతో పాటు చారిత్రక ఎర్రకోటపై జాతీయ జెండా స్థానంలో రైతుల జెండాను ఎగురవేశారు.

ఈ క్రమంలో ఓ అపశ్రుతి చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ట్రాక్టర్ల ర్యాలీలో పాల్గొన్న ఓ యువ రైతు మృతి చెందాడు. ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. పోలీసుల బుల్లెట్ తగలడం వల్లే రైతు మరణించాడని రైతు సంఘాల నేతలు ఆరోపించారు.

ఈ ఆరోపణలను ఢిల్లీ పోలీసులు ఖండించారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ వీడియోను విడుదల చేశారు. ఆందోళనకారులను అడ్డుకోవడానికి పోలీసులు బారీకేడ్లను ఏర్పాటు చేశారు.

Also Read:ఢిల్లీలో టెన్షన్: అమిత్ షా ఆరా, ఇంటర్నెట్ సేవలు బంద్

అయితే.. రైతులు తమ ట్రాక్టర్లతో ఆ బారీకేడ్లను ఢీకొట్టుకుంటూ వచ్చారు. ట్రాక్టర్లతో గుద్ది బారీకేడ్ల అడ్డు తొలగించుకున్నారు. తమను అడ్డుకోవడానికి ప్రయత్నించిన పోలీసులను కూడా ట్రాక్టర్లతో చెదరగొట్టారు.

సదరు వీడియోలో ఐటీవో జంక్షన్ వద్ద జరిగిన ఘటనలోనూ రైతు ఇలాగే ఓ ట్రాక్టర్‌తో బారీకేడ్ల మీదకు దూసుకొచ్చాడు. అతివేగంతో రావడంతో బారీకేడ్లను డీకొట్టగానే ట్రాక్టర్ అదుపుతప్పి రోడ్డుపై పల్టీ కొట్టింది.

ట్రాక్టర్ నడుపుతున్న ఆ రైతు.. ఈ ప్రమాదంలో వాహనం కింద నలిగి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు సీసీటీవీ దృశ్యాల్లో స్పష్టంగా కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

 

"

click me!