‘మానిప్యులేటెడ్ మీడియా’’ వివాదం: ట్విట్టర్ ప్రకటనకు ఢిల్లీ పోలీసుల కౌంటర్

By Siva KodatiFirst Published May 27, 2021, 7:42 PM IST
Highlights

తమ కార్యాలయాల్లో సోదాలకు యత్నించడం ద్వారా భావ ప్రకటనా స్వేచ్చకు విఘాతం కలిగిస్తున్నారంటూ ట్విట్టర్ చేసిన ప్రకటన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు కౌంటరిచ్చారు.

తమ కార్యాలయాల్లో సోదాలకు యత్నించడం ద్వారా భావ ప్రకటనా స్వేచ్చకు విఘాతం కలిగిస్తున్నారంటూ ట్విట్టర్ చేసిన ప్రకటన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు కౌంటరిచ్చారు.  ప్రపంచవ్యాప్తంగా తాము చేస్తున్నట్లుగానే, పారదర్శకతా సూత్రాల మార్గదర్శకత్వంలో కచ్చితంగా పని చేస్తామని, తమ సర్వీస్‌పై గల ప్రతి గళానికి సాధికారత కల్పించేందుకు కట్టుబడి ఉంటామని, చట్టపరమైన నిబంధనల మేరకు భావ ప్రకటన స్వేచ్ఛ, వ్యక్తిగత గోప్యతలను పరిరక్షించేందుకు కట్టుబడి ఉంటామని ట్విట్టర్ అధికారిక ప్రతినిధి అన్నారు. 

దీనిపై ఢిల్లీ పోలీసులు స్పందించారు. ట్విట్టర్ ఒక మెటీరియల్ ఇన్ఫర్మేషన్ ప్రాతిపదికను కలిగి ఉందని పేర్కొన్నారు.  ఇది దర్యాప్తు చేయడమే కాకుండా ఒక నిర్ణయానికి వచ్చిందని.. అయితే అది ఆ సమాచారాన్ని పోలీసులతో పంచుకోవాలని కోరారు. 

‘కాంగ్రెస్ టూల్‌కిట్’పై బీజేపీ నేతల పోస్ట్‌లకు ట్విటర్ ‘‘మానిప్యులేటెడ్ మీడియా’’ అని ట్యాగ్ చేసింది. ఈ ట్యాగ్‌ను తొలగించాలని ప్రభుత్వం కోరింది. దీనిపై నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీ పోలీసులు ఢిల్లీ, గురుగ్రామ్‌లలోని ట్విటర్ ఇండియా కార్యాలయాలకు సోమవారం సాయంత్రం వెళ్ళారు. ఈ నేపథ్యంలోనే ట్విటర్, ప్రభుత్వం మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడిన సంగతి తెలిసిందే

ట్విట్టర్‌ ఇండియా ప్రవర్తన అస్పష్టంగా, తప్పించుకునే విధంగా వుందని ఢిల్లీ పోలీసులు మండిపడ్డారు. చట్టాన్ని గౌరవించి.. దానిని అమలు చేసేందుకు గాను ట్విట్టర్ తన వద్దనున్న సమాచారాన్ని అందజేయాలని ఢిల్లీ పోలీసులు విజ్ఞప్తి చేశారు. ట్విట్టర్ ఒక పబ్లిక్ ఫ్లాట్‌ఫామ్ కావడంతో దాని పనితీరులో పారదర్శకతను ప్రదర్శించడంలో ఉదాహరణగా స్పందించాలన్నారు. ఇది ప్రజలపై ప్రభావం చూపుతుందని.. పబ్లిక్ డొమైన్‌కు సంబంధించిన విషయాలపై ముందుగానే స్పష్టతను తీసుకురావాలని పోలీసులు వెల్లడించారు. 

Also Read:ఫేస్‌బుక్, గూగుల్, ట్విట్టర్‌లకు కొత్త ఐటీ మార్గదర్శకాలు.. నేటినుంచే అమల్లోకి..

వాస్తవాలను ప్రజాక్షేత్రంలో ఉంచి, ఢిల్లీ పోలీసులు కాంగ్రెస్ అధికారి ప్రతినిధి చేసిన ట్వీట్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు చెప్పారు. ఇది భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ అని చిత్రీకరించడానికి ట్విట్టర్ చేసిన ప్రయత్నాలు పూర్తిగా తప్పు అని ఢిల్లీ పోలీసులు హితవు పలికారు. దర్యాప్తులో సహకరించడానికి బదులు ట్విట్టర్ ఇండియా అనుబంధ సంస్థ - టిసిఐపిఎల్ మేనేజింగ్ డైరెక్టర్ తప్పించుకున్నారని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు.

తొలుత, టిసిఐపిఎల్ మేనేజింగ్ డైరెక్టర్ తన ప్రతిస్పందనలో తాను కేవలం సేల్స్ హెడ్ అని, కంటెంట్‌కు సంబంధించిన ఏ ఆపరేషన్లలోనూ పాత్ర లేదని, తద్వారా విచారణకు నిరాకరించానని తెలిపారు. అయితే టీసీఐపీఎల్ ఎండీ వైఖరి తన మునుపటి ప్రెస్ ఇంటర్వ్యూలకు విరుద్ధంగా నడుస్తుందని గమనించాలని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఇందులో దుర్వినియోగ / మానిప్యులేటివ్ కంటెంట్‌ను గుర్తించడానికి పద్ధతులను రూపొందించే ట్విట్టర్ ప్రణాళికను అతను విస్తృతంగా చర్చించాడని పోలీసులు వెల్లడించారు. దీనిని బట్టి ట్విట్టర్ ఇండియా వైఖరి ఏంటో ఆయన ఇంటర్వ్యూ స్పష్టం చేస్తుందని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. చట్టాన్ని పాటించటానికి నిరాకరించడం, భౌతిక సాక్ష్యాలు ఉన్నాయని చెప్పుకోవడం ద్వారా సందేహాస్పదమైన సానుభూతిని పొందటానికి ట్విట్టర్ తాజా ప్రకటనలు రూపొందించబడ్డాయని ఢిల్లీ పోలీసులు మండిపడ్డారు.

కాగా, భారత దేశంలో తమ ఉద్యోగుల విషయంలో జరిగిన సంఘటనల పట్ల, తాము సేవలందిస్తున్న ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛకు సంభవించే అవకాశం గల ముప్పు పట్ల ఆందోళన చెందుతున్నట్లు ట్విట్టర్ తెలిపిన సంగతి తెలిసిందే. 

click me!