Latest Videos

Delhi murder: చంపినందుకు పశ్చాత్తాపమేమీ లేదు, 15 రోజుల క్రితమే మర్డర్ ప్లాన్: ఢిల్లీ పోలీసులు

By Mahesh KFirst Published May 30, 2023, 12:41 PM IST
Highlights

ఢిల్లీలో 16 ఏళ్ల బాలికను అత్యంత క్రూరంగా 20 ఏళ్ల సాహిల్ అనే యువకుడు హత్య చేశాడు. కత్తితో 21 సార్లు పొడిచి, అనంతరం బండరాయిని తలపై వేసి చంపేశాడు. ఈ హత్య చేసినందుకు సాహిల్‌లో పశ్చాత్తాపమేమీ లేదని, 15 రోజుల క్రితమే మర్డర్ ప్లాన్ వేశాడని పోలీసులు తెలిపారు.
 

న్యూఢిల్లీ: 16 ఏళ్ల టీనేజీ బాలికను 20 ఏళ్ల సాహిల్ బట్టబయలు ప్రజలు తిరుగుతున్న రోడ్డు పక్కనే దారుణంగా హతమార్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటన కలకలం రేపింది. కత్తితో 21 సార్లు పొడిచేశాడు. ఆ బాలిక నిస్సహాయంగా నేలకూలిపోయింది. ఆ తర్వాత పక్కనే ఉన్న ఓ గుండును పైకెత్తి ఆమె తలపై పలుమార్లు విసిరేశాడు. ఈ హత్య బహిరంగంగా జరిగింది. అక్కడి నుంచి ప్రజలు నడుచుకుంటూ వెళ్లుతున్నారు. వారంతా ఆ దుర్మార్గాన్ని చూశారే తప్పా.. ఒక్కరూ జోక్యం చేసుకునే ధైర్యం చేయలేదు. ఈ ఘటన ఢిల్లీలోని రోహిణిలో షాబాద్ డైరీ ఏరియాలో జరిగింది. 

నిందితుడు సాహిల్‌ను ఢిల్లీ పోలీసులు నిన్న బులంద్‌షహర్‌లో అరెస్టు చేశారు. నిన్న రాత్రి సాహిల్‌ను ఢిల్లీ పోలీసులు విచారించారు. బావనా పోలీసు స్టేషన్‌లో సాహిల్‌ను ఉంచారు. పోలీసుల దర్యాప్తులో సాహిల్ వెల్లడించిన విషయాలూ అంతే దుర్మార్గంగా, క్రూరంగా ఉన్నాయి.

Also Read: ఢిల్లీ టీన్ మర్డర్ : హత్యకు కొద్ది రోజుల ముందు బాయ్‌ఫ్రెండ్‌ను బొమ్మ తుపాకీతో భయపెట్టి, బ్రేకప్ చెప్పి..

దారుణ హత్య  చేసిన పశ్చాత్తాపం, బాధ ఏమీ సాహిల్‌లో లేదని పోలీసులు తెలిపారు. 16 ఏళ్ల బాలికను చంపడానికి ఉపయోగించిన కత్తిని కొనుగోలు చేశాడని వివరించారు. సుమారు 15 రోజుల ముందే హత్య చేయడానికి కత్తి కొన్నాడని తెలిపారు. ఆ టీనేజీ బాలికను చంపడానికి సాహిల్ 15 రోజుల క్రితమే ప్లాన్ వేసుకున్నాడని తెలుస్తున్నదని అన్నారు.

ఆ కత్తి ఇంకా లభించలేదు. దాన్ని ఎక్కడ వేశాడో సాహిల్ వెల్లడించలేదు. దాని కోసం అధికారులు గాలిస్తున్నారు.

ఈ విచారణలో సాహిల్ కీలక విషయాలు వెల్లడించినట్టు తెలిసింది. సాహిల్ ఆ బాలికతో మూడేళ్లు ప్రేమలో ఉన్నట్టు తెలిసింది. ఆ బాలిక ఏసీ రిపేర్‌మ్యాన్ అయిన సాహిల్‌తో బ్రేక్ అప్ చేసుకోవాలని అనుకుంది. తన మాజీ బాయ్‌ఫ్రెండ్‌తో మళ్లీ ఆ బాలిక సన్నిహితంగా ఉండింది. తన మాజీ బాయ్‌ఫ్రెండ్ ఒక గూండా అని కూడా సాహిల్‌ను హెచ్చరించినట్టు తెలిసింది. సాహిల్ కూడా భయపడ్డాడు.

మూడేళ్లు డేటింగ్ చేసిన తర్వాత బాలిక ఆ రిలేషన్‌షిప్ వదిలించుకోవాలని నిర్ణయించుకుందని పోలీసులు తెలిపారు. తనను పట్టించుకోవడం లేదని సాహిల్ ఆగ్రహించాడు. ఫుల్‌గా లిక్కర్ తాగి బాలికపై దాడికి దిగాడు.

ఆదివారం సాయంత్రం ఆ బాలిక తన ఫ్రెండ్ ఇంట్లో బర్త్ డే పార్టీ ఉంటే అటెండ్ కావడానికి బయల్దేరింది. ఇంతలో ఆమెను దొరికించుకుని సాహిల్ దారుణంగా చంపేశాడు.

click me!