ఢిల్లీ మేయర్ ఎన్నిక: ఆప్, బీజేపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం, కుర్చీలపై ఎక్కి నిరసన

By narsimha lodeFirst Published Jan 6, 2023, 12:37 PM IST
Highlights

ఢిల్లీ మేయర్  పదవికి ఎన్నిక జరగడానికి ముందే  ఆప్, బీజేపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం జరిగింది.  స్పీకర్ ఎంపిక విషయంలో  నిబంధనలను విస్మరించారని  ఆప్  ఆరోపిస్తూ  ఆందోళనకు దిగింది.  

న్యూఢిల్లీ:  ఢిల్లీ కార్పోరేషన్ లో  నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్ల ప్రమాణం సందర్భంగా  శుక్రవారంనాడు ఆప్, బీజేపీ కౌన్సిలర్ల మధ్య  మాటల యుద్ధం సాగింది. ఇరు వర్గాలు  పరస్పరం ఆరోపణలు  చేసుకోవడంతో  ఉద్రిక్తత  చోటు  చేసుకుంది.  నూతనంగా  ఎన్నికైన కౌన్సిలర్ల ప్రమాణస్వీకారోత్సవానికి  బీజేపీకి  చెందిన  సత్యశర్మను  తాత్కాలిక స్పీకర్ గా  లెఫ్టినెంట్ గవర్నర్ నియమించడంపై  ఆప్  కౌన్సిలర్లు మండిపడుతున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ చర్యను  ఆప్ కౌన్సిలర్లు తీవ్రంగా తప్పుబడుతున్నారు. కౌన్సిలర్ల ప్రమాణాన్ని  ప్రిసైడింగ్ అధికారి  సత్యశర్మ ప్రారంభించేందుకు  ప్రయత్నించడంతో  ఆప్ కౌన్సిలర్లు  నిరసనకు దిగారు. వెల్ లోకి ప్రవేశించి  ఆప్  కౌన్సిలర్లు  నిరసన చేశారు. కుర్చీలపై నిలబడి  ఆందోళన చేశారు. 

 ఢిల్లీ మేయర్  ఎన్నిక ఇవాళ  జరగనుంది.  ఢిల్లీ కార్పో,రేషన్ ఎన్నికల్లో  ఆప్  మెజారిటీ స్థానాలను దక్కించుకుంది.  ఢిల్లీ మేయర్ పీఠాన్ని తాము దక్కించుకుంటామని  ఆప్ ధీమాగా ఉంది. కానీ  మరోసారి  ఢిల్లీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటామని బీజేపీ నేతలు చెబుతున్నారు.ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో  తాము పాల్గొనడం లేదని  కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.ఢిల్లీ మేయర్  పదవికి ఆప్ పార్టీ  షెల్లి ఒబెరాయ్ ను  ఎంపిక చేసింది.  మేయర్ పదవికి  బీజేపీ తరపున  రేఖా కూడా బరిలోకి దిగనున్నారు.  ఢి్ల్లీ మేయర్ ఎన్నికను ప్రభావితం చేసేలా  స్పీకర్ ను ఎంపిక చేశారని  ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.  అత్యంత సీనియర్ సభ్యుడిని ప్రొటెం స్పీకర్ లేదా ప్రిసైడింగ్ ఆఫీసర్ గా  నామినేట్ చేయడం సంప్రదాయం అని  ఆప్ ఎమ్మెల్యే  భరద్వాజ్ ట్వీట్ చేశారు. కానీ సంప్రదాయానికి  భిన్నంగా వ్యవహరించారని ఆరోపించారు. గత నెలలో  జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆప్  134 కౌన్సిలర్ స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ 104 స్థానాల్లో గెలిచింది. 250 స్థానాలున్న ఢిల్లీ కార్పోరేషన్ లో  కాంగ్రెస్ పార్టీ 9 స్థానాలకే పరిమితమైంది. 
 

click me!