
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారించేందుకు కోర్టు అనుమతించింది. ఈ కేసుకు సంబంధించి బుచ్చిబాబును సీబీఐ విచారించేందుకు గతంలో కోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే. ఇక, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి బుచ్చిబాబును ఈ నెల 7న సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన విచారణ నిమిత్తం బుచ్చిబాబును ఢిల్లీకి పిలిపించిన అధికారులు.. అతను విచారణకు సహకరించకపోవడం, ప్రశ్నలను దాటవేయడంతో అదుపులోకి తీసుకున్నట్టుగా తెలిపారు.
అనంతరం బుచ్చిబాబును కోర్టులో హాజరుపరుచగా.. మూడు రోజుల సీబీఐ కస్టడీకి కోర్టు అనుమతించింది. బుచ్చిబాబు మూడు రోజుల కస్టడీ ముగిసిన తర్వాత ఈ నెల 25 వరకు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సౌత్ గ్రూప్ నుంచి కీలక పాత్ర పోషించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న బుచ్చిబాబును విచారించేందుకు ఈడీ కూడా అనుమతి కోరింది. ఈ క్రమంలోనే బుచ్చిబాబను ఈడీ ప్రశ్నించేందుకు కోర్టు అనుమతించింది. ఇక, ప్రస్తుతం బుచ్చిబాబు తిహార్ జైలులో ఉన్నారు.
ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ, సీబీఐలు దూకుడు పెంచాయి. వరసుగా పలువురిని అరెస్ట్ చేయడంతో.. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను మరోమారు విచారించేందుకు సీబీఐ సిద్దమైంది.
ఇదిలా ఉంటే.. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22 గత ఏడాది ఆగస్టులో రద్దు చేయబడింది. ఇందులో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు రావడంతో వాటిపై దర్యాప్తు చేయాల్సిందిగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సీబీఐని కోరారు. దీంతో సీబీఐ విచారణ చేపట్టింది. సీబీఐ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్ నుంచి మనీలాండరింగ్‌కు సంబంధించిన అంశాలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఇక, ఇప్పటి వరకు ఈడీ ఈ కేసులో రెండు ఛార్జ్ షీట్లు దాఖలు చేసింది.