Delhi Liquor Scam Case: కేజ్రీవాల్, కవితకు చుక్కెదురు.. ఇంతకీ ఊరట లభించేనా? 

By Rajesh KarampooriFirst Published Apr 15, 2024, 4:41 PM IST
Highlights

Delhi Liquor Scam Case: లోక్ సభ ఎన్నికల వేళ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రకంపనలు రేపుతోంది. ఈ కేసులో అరెస్టయినా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకే కాదు .. ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ కు కూడా నిరాశే ఎదురైంది. అయితే. వీరి ఊరట లభించే అవకాశం లేదా?   

Delhi Liquor Scam Case: గల్లీ నుంచి ఢిల్లీ వరకు రాజకీయాలను షేక్ చేస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకే కాదు .. ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌(Kejriwal) కూడా నిరాశే ఎదురైంది. ఈ కేసులో ప్రధాన నిందితులు గా ఉన్న వీరివురు కటకటాల పాలయ్యారు. తొలుత కల్వకుంట్ల కవిత విషయానికి వస్తే..రౌస్ అవెన్యూ కోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. తొలుత ఈ కేసులో ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ కోర్టు 9 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీ విధించిన విషయం తెలిసిందే. ఈ కస్టడీ ముగియడంతో సీబీఐ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో ఎమ్మెల్సీ కవితను హాజరుపరిచారు. ఈ  సందర్భంగా 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించాలని సీబీఐ విన్నవించుకోగా.. మరో 9 రోజుల పాటు కస్టడీ విధించింది. 

దీంతో ఈనెల 23 వరకు ఆమె జ్యుడీషియల్ కస్టడీలోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. కోర్టు ఆదేశాలతో పోలీసులు ఎమ్మెల్సీ కవితను తీహార్ జైలుకు తరలించారు.  అలాగే.. ఈ కోర్టు ఆవరణలో ఇది సీబీఐ కస్టడీ కాదని బీజేపీ కస్టడీ అంటూ కవిత సంచలన ఆరోపణలు చేయడంపై కూడా కోర్టు సీరియస్ అయ్యిందట. ఇకపోతే ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తొలుత ఈడీ ఎమ్మెల్సీ కవితను మార్చి 15న అరెస్ట్ చేసింది. ఈ క్రమంలో మార్చి 26 నుంచి తీహార్ జైల్లో ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. అనంతరం పలుమార్లు బెయిల్ కోసం అప్లై చేయగా.. ఫలితం లేకుండా పోయింది. 

మరోవైపు.. ముఖ్యమంత్రి హోదాలో అరెస్టయినా కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులోనూ నిరాశే ఎదురైంది. ఈడీ(ED) అరెస్ట్‌ ను సవాలు చేస్తూ.. పిటిషన్ ను వాయిదా వేసింది. ఏప్రిల్ 29న విచారిస్తానని జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం స్పష్టం చేసింది. అదే సమయంలో కేజ్రీవాల్ అరెస్ట్‌పై ఈడీకి నోటిసులు జారీ చేసింది. వాస్తవానికి సీఎం కేజ్రీవాల్ ఈడీ అరెస్ట్, ట్రయిల్ కోర్టు కస్టడీని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ కేజ్రీవాల్ రౌస్ అవెన్యూ కోర్టు, ఢిల్లీ హైకోర్టులోనూ పిటిషన్ దాఖలు చేశారు. కాగా.. ఈ రెండు పిటిషన్లు కూడా ఆయా కోర్టుల్లో తిరస్కరించబడ్డాయి. ఈ తరుణంలో సుప్రీంకోర్టు సైతం విచారణను వాయిదా వేసింది. దీంతో మరికొన్ని రోజులు కేజ్రీవాల్ జైల్లో ఉండాల్సి వచ్చింది.   

click me!