
దేశంలో కరోనా విలయం కొనసాగుతోంది. మరోవైపు ఆక్సీజన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. మరీ ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలోని ప్రధాన ఆస్పత్రులు ఆక్సీజన్ సప్లయ్ లేక అల్లాడి పోతున్నాయి.
తాజాగా ఢిల్లీలోని బాత్రా ఆస్పత్రిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆక్సీజన్ లేకపోవడంతో ఎనిమిది మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగం అధిపతి డాక్టర్ ఆర్.కె. హిమాథని ఉండటం మరింత విషాదాన్ని నింపింది.
ఐసీయూలో చికిత్స పొందుతున్న మరో ఐదుగురు ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు శ్రమిస్తున్నారు. దేశ రాజధానిలో ఆక్సీజన్ సంక్షోభం మీద వరుసగా 11వ రోజు ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. తమ వద్ద ఉన్న ఆక్సీజన్ నిల్వలు అయిపోతున్నాయని తక్షణమే స్పందించాలని వివిధ ఆస్పత్రులు యజమాన్యాలు వేడుకుంటున్నాయి.
అంతకు ముందు బాత్రా హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుధాన్షు తాము ఆక్సిజన్ సంక్షోభంలో ఉన్నామనీ, రాబోయే 10 నిమిషాల్లో పూర్తిగా అయిపోతుందని, ఆదుకోవాలంటూ ఒక వీడియోను విడుదల చేయడం గమనార్హం. కానీ అధికారులు తేరుకుని ఆక్సీజన్ రీ సప్లై ట్యాంకర్ చేరుకునేసరికే అనర్థం జరిగిపోయింది.
రోగుల ప్రాణాలను రక్షించడంలో కీలకమైన ఆక్సిజన్ అందక ఊపిరి ఆగిపోతున్న వైనాన్ని తలుచుకుంటేనే గుండె తరుక్కుపోతోంది. అంతా అయిపోయిన 45 నిమిషాల తరువాత ట్యాంకర్ చేరుకుందని, అప్పటికే తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారు ప్రాణాలు కోల్పోయారని ఆస్పత్రి అధికారులు ఢిల్లీ హైకోర్టుకు తెలిపారు.
కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పకుండా ధరించాలని, శానిటైజ్ చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని ఏషియానెట్ విజ్ఢప్తి చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా కరోనా టీకా తీసుకోవాలని కూడా కోరుతోంది. అందరం కలిసి కరోనా వ్యాప్తిని అరికడుదాం, మనల్ని మనం రక్షించుకుందాం. #ANCares #IndiaFightsCorona