మెదడులో కొంత భాగం మిస్సింగ్, బయటకు వచ్చిన పక్కటెముకలు: అంజలి శవపరీక్షలో షాకింగ్ విషయాలు..

By Sumanth KanukulaFirst Published Jan 4, 2023, 4:00 PM IST
Highlights

దేశ రాజధాని ఢిల్లీలో అంజలి అనే యువతిని కారుతో ఢీకొట్టి లాక్కెళ్లిన ఘటనకు సంబంధించి షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా అంజలి శవపరీక్ష నివేదికలో భయానక విషయాలు వెలుగు చూశాయి. 

దేశ రాజధాని ఢిల్లీలో అంజలి అనే యువతిని కారుతో ఢీకొట్టి లాక్కెళ్లిన ఘటనకు సంబంధించి షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా అంజలి శవపరీక్ష నివేదికలో భయానక విషయాలు వెలుగు చూశాయి. ఆమె శరీరంపై బాహ్యంగా అనేక గాయాలు అయ్యాయని శవపరీక్ష వెల్లడించింది. నివేదిక ప్రకారం.. అంజలిని కారుతో పాటు ఈడ్చుకుంటూ వెళ్లడం వల్ల చర్మం ఒల్చినట్లు అయింది. పక్కటెముకలు బయటపడ్డాయి.  ఆమె ఊపిరితిత్తులు బయటకు వచ్చాయి. రెండు కాళ్లు విరిగిపోవడంతో పాటు.. పుర్రె ఛిద్రమైంది. మెదడులోని కొంత భాగం కనిపించలేదు.

ప్రమాదంలో అంజలి తల, వెన్నెముక, కింది అవయవాలపై గాయాలయ్యాయని నివేదిక వెల్లడించింది. ఆమె మరణానికి కారణం షాక్, రక్తస్రావం అని జాబితా చేయబడింది. తీవ్రమైన గాయాలు సమిష్టిగా ఆమె మరణానికి కారణమై ఉండవచ్చని నివేదిక పేర్కొంది. ఇక, శవపరీక్ష నివేదిక ప్రకారం.. అంజలికి లైంగిక వేధింపులకు గురిచేసే ఎలాంటి గాయం కాలేదు.

ఇక, ఒక ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలో పనిచేసే అంజలిడిసెంబర్ 31 సాయంత్రం న్యూ ఇయర్ ఈవ్ పార్టీకి హాజరయ్యేందుకు అమన్ విహార్‌లోని తన ఇంటి నుండి బయలుదేరింది. రాత్రి 9 గంటల ప్రాంతంలో అంజలి ఇంటికి ఆలస్యంగా వస్తానని కుటుంబసభ్యులకు సమాచారం అందించింది. జనవరి 1, ఆదివారం తెల్లవారుజామున 3.24 గంటలకు, బూడిద గ్రే కలర్ బాలెనో కారు మృతదేహాన్ని లాగుతున్నట్లు పోలీసులకు కాల్ వచ్చింది. జోంటి గ్రామం హనుమాన్ మందిర్ సమీపంలో పోలీసులు తెల్లవారుజామున 4.11 గంటలకు మృతదేహాన్ని గుర్తించారు. శరీరంపై పెద్దఎత్తున గాయాలు ఉన్నాయి, బట్టలు చిరిగిపోయాయి. ఆమె రెండు కాళ్ళు శరీరం నుండి వేరు చేయబడ్డాయి.

ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు కారులో ఉన్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళ కారు చక్రాలకు ఇరుక్కుపోయిందని తమకు తెలియదని, రోడ్డుపై మలుపు తీసుకుంటుండగానే ఆ విషయం తమకు అర్థమైందని నిందితులు పేర్కొన్నారు. మహిళ మృతదేహాన్ని చూసి అక్కడి నుంచి పారిపోయామని నిందితులు పోలీసుల విచారణలో చెప్పారు. ఇక, నిందితులను దీపక్ ఖన్నా (26), అమిత్ ఖన్నా (25), క్రిషన్ (27), మిథున్ (26), మనోజ్ మిట్టల్ (27)లుగా గుర్తించారు. ప్రస్తుతం వారు పోలీసుల అదుపులో ఉన్నారు.

ఇదిలా ఉంటే.. ప్రమాదం  జరిగిన సమయంలో అంజలితో పాటు స్కూటీపైన మరో యువతి నిధి ఉన్నట్టుగా సీటీటీవీ పరిశీలిన ద్వారా పోలీసులు గుర్తించారు. నిన్న మీడియాతో మాట్లాడిన నిధి.. ప్రమాదంలో కారు కింద అంజలి ఇరుక్కుపోయిందని తెలిసినా యువకులు వాహనాన్ని ముందుకు నడిపారని చెప్పారు. ‘‘మా స్కూటీని కారు ఢీకొట్టింది. దీంతో మా తలకు గాయాలు అయ్యాయి. నేను ఒకవైపు పడ్డాను. కానీ అంజలి కారు ముందు పడిపోయింది. కారు కింద ఇరుక్కుపోయింది. ఒక అమ్మాయి కారు కింద పడిపోయిందని అందులో ఉన్న వ్యక్తులకు తెలుసు. కానీ వారు ఉద్దేశపూర్వకంగానే ఆమె పైనుంచి పోనిచ్చారు. కారు కింద పడిపోయిన తరువాత నా స్నేహితురాలు గట్టిగా అరుస్తూనే ఉంది. నాకు ఏం అర్థం కాలేదు. నేను అక్కడి నుంచి ఇంటికి వెళ్లాను. ఎవరికీ ఏమీ చెప్పలేదు. భయంతో ఈ విషయాన్ని బయటపెట్టలేదు’’ అని నిధి తెలిపారు. 

click me!