యోయో హనీసింగ్‌కు కోర్టు లాస్ట్ వార్నింగ్.. గృహహింస కేసులో హాజరవ్వాలని ఆర్డర్

Published : Aug 28, 2021, 12:38 PM ISTUpdated : Aug 28, 2021, 12:39 PM IST
యోయో హనీసింగ్‌కు కోర్టు లాస్ట్ వార్నింగ్.. గృహహింస కేసులో హాజరవ్వాలని ఆర్డర్

సారాంశం

పంజాబీ సింగర్, యాక్టర్ యోయో హనీసింగ్‌కు ఢిల్లీ కోర్టు గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఆయన భార్య దాఖలు చేసిన కేసులో న్యాయస్థానం ముందు హాజరవ్వాలని ఆదేశించింది. న్యాయం ముందు అందరూ సమానులేనని, కేసును ఇంత లైట్‌గా తీసుకుంటున్నారని ఆశ్చర్యపడింది.

న్యూఢిల్లీ: ప్రముఖ పంజాబీ సింగర్, యాక్టర్ యోయో హనీసింగ్‌పై ఢిల్లీ కోర్టు తీవ్రంగా మండిపడింది. ఆయన భార్య దాఖలు చేసిన కేసులో కోర్టుకు హాజరవ్వాలని లాస్ట్ వార్నింగ్ ఇచ్చింది. చట్టానికి ఎవరూ అతీతులు కాదని స్పష్టం చేసింది. ఈ కేసును ఎంత లైట్‌గా తీసుకుంటున్నారో చూస్తే ఆశ్చర్యం వేస్తున్నదని మందలించింది.

పంజాబ్‌కు చెందిన హిర్దేశ్ సింగ్ ప్రొఫెషనల్‌గా యోయో హనీసింగ్ పేరుతో ప్రాచుర్యంలో ఉన్నారు. ఆయన తన పాటలతో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. కొన్ని సినిమాల్లోనూ నటించారు. ఆయన 2011 జనవరి 23న షాలిని తల్వార్‌తో పెళ్లి చేసుకున్నారు.

ఇటీవలే ఆమె హనీసింగ్‌పై ఆరోపణలు చేస్తూ కోర్టుకెక్కారు. పదేళ్లుగా ఆయన తనపై భౌతికంగా దాడి చేస్తున్నారని ఆరోపించారు. అంతేకాదు. ఆయన తనను చీట్ చేశారని పేర్కొన్నారు. భౌతికంగా, మౌఖికంగా, మానసికంగా, భావోద్వేగంగా ఎన్నో తీరులో తనను హింసించారని ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలతో గృహ హింస కేసు పెట్టారు. గృహ హింస చట్టంలోని రక్షణ కింద తనకు రూ. 20 కోట్ల పరిహారాన్ని ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. ఈ కేసును ఢిల్లీ మెట్రోపాలిటాన్ మెజిస్ట్రేట్ విచారిస్తున్నారు.

ఈ కేసు విచారణలో భౌతికంగా హాజరును మినహాయించాలని కోరుతూ హనీసింగ్ ఓ అప్లికేషన్‌ పెట్టుకున్నారు. మెడికల్ కారణాలు పేర్కొంటూ మినహాయింపును అడిగారు. కాగా, ఆయన భార్య షాలిని తల్వార్ మాత్రం కోర్టుకు హాజరయ్యారు. ఈ సాకుతోనే ఆయన ఇప్పటి వరకు కోర్టుకు హాజరవ్వలేదు. దీంతో న్యాయస్థానం హనీసింగ్‌ను మందలించింది. ఆయనకిదే చివరి వార్నింగ్ అని, వచ్చే విచారణలో కచ్చితంగా హాజరవ్వాల్సిందేనని ఆదేశించింది.

‘హనీసింగ్ ఇప్పటి వరకు కోర్టు ముందు హాజరవ్వలేదు. ఆయన ఆదాయ వివరాలను మీరు సమర్పించలేదు. వాదనలకూ సిద్ధం కాలేదు’ అని హనీసింగ్ న్యాయవాదిపై మండిపడింది. హనీసింగ్ న్యాయవాది అడ్వకేట్ ఇషాన్ ముఖర్జీ మాట్లాడుతూ, ఆమె ఇప్పటికే నగలు సహా విలువైన వస్తువులను తీసుకెళ్లారని కోర్టుకు తెలిపారు. అయినా, ఆమె నోయిడాలోని అత్తవారింటిలో ఉండవచ్చునని అన్నారు. 15 రోజుల్లో ఆమె అక్కడ ఉండటానికి ఏర్పాట్లు చేస్తామని వివరించారు. హనీసింగ్‌కు రూ. 4 కోట్లు విలువ చేసే రెండు ఆస్తులున్నాయని, అందులో ఒకటి రూ. 1 కోటి విలువ చేసే ప్రాపర్టీ షాలినీ పేరిటనే ఉన్నదని చెప్పారు.

హనీసింగ్ వివాదాస్పద పాటలతో తొలుత ఫేమ్ సంపాదించిన సంగతి తెలిసిందే. కొంత కాలం ఆయన పాటలపై నిషేధం కూడా అమలైంది. తర్వాత యూత్‌లో క్రేజ్ పెరిగాక బాలీవుడ్‌లోనూ పలు సినిమాల్లో పాటలుపాడారు.

PREV
click me!

Recommended Stories

Top 5 Biggest Railway Stations : ఏ ముంబై, డిల్లీలోనో కాదు.. దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు