
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ అరెస్టుపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ ముందుగానే జోస్యం చెప్పారు. తమ మంత్రి సత్యేందర్ జైన్‌ను ఈడీ అరెస్టు చేస్తుందని ఆయన జనవరి నెలలోనే ఊహించారు. తమకు ఉన్న సోర్స్ ప్రకారం, పంజాబ్ ఎన్నికల ముందు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సత్యేందర్ జైన్‌ను అరెస్టు చేస్తుందని కేజ్రీవాల్ జనవరిలో తెలిపారు. వారందరికీ స్వాగతం అని వ్యంగ్యం పలికారు. గతంలోనూ కేంద్ర ప్రభుత్వం సత్యేందర్ జైన్‌పై తనిఖీలు నిర్వహించిందని, కానీ, వారికి ఏమీ దొరకలేదని అన్నారు. ఈ విషయాలను ఆయన జనవరిలో అన్నారు.
తాజాగా, ఢిల్లీ హోం మంత్రి, ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్‌ను మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అరవింద్ కేజ్రీవాల్ అన్నట్టుగానే ఈడీ సత్యేందర్ జైన్‌ను అరెస్టు చేసింది. కానీ, టైమింగ్ వేరు. అటే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాకుండా ఆ ఎన్నికలు ముగిసిన తర్వాత తాజాగా, అరెస్టు చేసింది.
ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) అరెస్ట్ చేసింది. మనీ లాండరింగ్ వ్యవహారంలో ఈడీ అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు. కోల్‌కతాకు చెందిన ఓ కంపెనీకి సంబంధించిన హవాలా లావాదేవీలకు సంబంధించిన కేసులో సత్యేందర్ జైన్‌ను అరెస్ట్ చేసినట్టు ఈడీ అధికారులు ధ్రువీకరించినట్టుగా న్యూస్ ఏజెన్సీ ANI తెలిపింది. సత్యేందర్ జైన్.. 2015-16లో కోల్‌కతాకు చెందిన సంస్థతో హవాలా లావాదేవీలకు పాల్పడ్డారని ఈడీ ఆరోపించింది. ఆ సమయంలో సత్యేందర్ జైన్ పబ్లిక్ సర్వేంట్‌గా ఉన్నారు.
ఇక, గత నెలలో.. సత్యేందర్ జైన్, అతని కుటుంబానికి చెందిన రూ. 4.81 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తాత్కాలికంగా అటాచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు 2018లో సత్యేంద్ర జైన్‌ను ప్రశ్నించారు. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది పంజాబ్ ఎన్నికల సందర్భంగా జరిగిన ర్యాలీలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మాట్లాడుతూ.. సత్యేందర్ జైన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందని చెప్పారు.
సత్యేందర్ జైన్ అరెస్ట్‌పై ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి అరెస్టుపై మనీష్ సిసోడియా స్పందిస్తూ.. సత్యేంద్ర జైన్‌పై 8 ఏళ్లుగా ఫేక్ కేసు నడుస్తోందని.. ఇప్పటి వరకు ఈడీ ఆయనకు చాలాసార్లు సమన్లు పంపిందని.. కొంతకాలం తర్వాత ఈడీ ఆయనకు ఫోన్ చేయడం మానేసిందని అన్నారు. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఇన్‌చార్జి సత్యేంద్ర జైన్‌గా ఉన్నందున ఇప్పుడు వారు మళ్లీ చర్యలు ప్రారంభించారని అన్నారు.