
Manish Tewari slams his own party: పలువురు ప్రముఖ కాంగ్రెస్ నేతలకు రాజ్యసభకు టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్ నేత మనీష్ తివారీ తన సొంత పార్టీపై విమర్శలతో విరుచుకుపడటం సంచలనంగా మారింది. రాజ్యసభ ఎన్నికలకు ఏడు రాష్ట్రాల నుంచి 10 మంది అభ్యర్థుల పేర్లను ఆదివారం (మే 29) కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ జాబితాలో పలువురు ప్రముఖుల పేర్లు లేకపోవడంతో పార్టీలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇదే విషయమై మనీష్ తివారీ మాట్లాడుతూ, "నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం రాజ్యసభ ఏర్పాటైన కార్యక్రమాలను నిర్వహించడం మానేసింది.. రాజ్యసభ ఇప్పుడు పార్కింగ్ స్థలంగా మారింది. దేశానికి రాజ్యసభ అవసరమా లేదా అనేది పరిశీలించాల్సిన అవసరం ఉంది" అని అన్నారు. ఇప్పుడు మనీష్ తివారీ, పంజాబ్‌లోని ఆనంద్‌పూర్ సాహిబ్ నుండి కాంగ్రెస్ ఎంపీగా ఉన్నారు.
అంతకుముందు పంజాబ్ గాయకుడు, కాంగ్రెస్ నేత సిద్ధూ మూస్ వాలా దారుణ హత్య తర్వాత.. ఆయన ఈ ఘటనపై స్పందిస్తూ.. ఎవరో ఒకరు రాష్ట్ర ప్రభుత్వ సహనాన్ని పరీక్షిస్తున్నట్టుగా ఉందన్నారు. ‘‘పంజాబ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి వరుసగా ఇలాంటి దురదృష్టకర ఘటనలు జరుగుతున్నాయి. కబడ్డీ ఆటగాళ్లను చంపడం, మోహాలీలోని పంజాబ్ ఇంటెలిజెన్స్ ప్రధాన కార్యాలయంపై దాడి చేయడం.. జలంధర్ లో పోలీసులపై దాడి, ఇప్పుడు పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య’’ అని కాంగ్రెస్ ఎంపీ తివారీ అన్నారు. ఆదివారం 28 ఏళ్ల గాయకుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడైన సిద్ధూ మూసేవాలాను గుర్తుతెలియని పలువురు దుండగులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే.
పోలీసులను విశ్వాసంలోకి తీసుకుని పంజాబ్‌లో శాంతిభద్రతలను కాపాడాలని ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌ను మనీష్ అభ్యర్థించారు. ఏ వ్యక్తులకు భద్రత అవసరమో నిర్ధారించడానికి ఆబ్జెక్టివ్ ఆడిట్ నిర్వహించాలని తివారీ సూచించారు, ఎందుకంటే వారిని రక్షించడం రాష్ట్ర మరియు కేంద్రం బాధ్యత అని అన్నారు