ఢిల్లీలో పెరుగుతున్న కరోనా కేసులు.. మాస్క్ తప్పనిసరి ఆదేశాలు, రేపు సీఎం కేజ్రీవాల్ సమీక్షా సమావేశం

By Siva KodatiFirst Published Mar 30, 2023, 5:16 PM IST
Highlights

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ రేపు సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే ప్రభుత్వం మాస్క్ తప్పనిసరి ఆదేశాలు జారీ చేసింది. 
 

దేశంలో కరోనా కేసులు మరోసారి పెరుగుతుండటంతో ప్రజలు, ప్రభుత్వాలు ఉలిక్కిపడుతున్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో పెరుగుతున్న కేసులు.. గతాన్ని గుర్తుచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్ స్పందించారు. ప్రభుత్వం తమ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోందని.. సీఎం అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం దీనిపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారని ఆయన చెప్పారు. ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య తక్కువగా వున్నందున ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని భరద్వాజ్ స్పష్టం చేశారు. దేశ రాజధానిలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ 19 పరిస్థితిని సమీక్షించేందుకు గురువారం జరిగిన సమావేశం అనంతరం ఆయన మాట్లాడారు. ఈ భేటీకి ఆరోగ్య శాఖ సీనియర్ అధికారులు, ప్రభుత్వ ఆసుపత్రుల మెడికల్ డైరెక్టర్లు, ఎపిడెమియాలజిస్టులు, వైరాలజిస్టులు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్ధితిని తాము సమీక్షించామన్నారు. రోగ లక్షణాలు వున్న వారికి కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. ఆసుపత్రులకు వచ్చేవారు తప్పనిసరిగా మాస్క్‌లను ధరించాలన్నారు. ఆరోగ్య శాఖ శుక్రవారం ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు పరిస్ధితిని వివరిస్తుందని.. ఆ తర్వాత ఆయన తగిన సూచనలు చేస్తారని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో కోవిడ్ పరిస్ధితి , కేసుల పెరుగుదలను వారు ఎలా ఎదుర్కొంటున్నారనే దానిపై సీఎంకు వివరిస్తామని భరద్వాజ్ పేర్కొన్నారు. నమూనాల జీనోమ్ సీక్వెన్సింగ్ జరుగుతోందని.. ఇప్పటి వరకు ఆందోళనకర పరిస్ధితులు ఏవీ కనుగొనబడలేదన్నారు. 

Also REad: కరోనా కలవరం.. దేశంలో కొత్తగా 3,016 కోవిడ్ కేసులు.. నేడు ఢిల్లీ ఆరోగ్య శాఖ అత్యవసర సమావేశం

ఢిల్లీ ఆరోగ్య శాఖ డేటా ప్రకారం.. గతేడాది ఆగస్టు 31 తర్వాత తొలిసారిగా నగరంలో కోవిడ్ కేసులు 300కు పైగా నమోదయ్యాయి. అలాగే పాజిటివిటీ రేటు 13.89 శాతానికి పెరిగింది. బుధవారం కూడా కోవిడ్ కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీలో గతేడాది ఆగస్టు 31న 377 కేసులు నమోదవ్వగా.. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లో పాజిటివిటీ రేటు 2.58 శాతంగా వుంది. దేశంలో హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లూయెంజా కేసులు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో గత కొన్నిరోజులుగా ఢిల్లీలో కోవిడ్ కేసులు సైతం పెరుగుతున్నాయి. 

click me!