
ఢిల్లీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 17 నుంచి ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ మార్చి 21న వార్షిక బడ్జెట్ 2023-24ను సమర్పించనున్నారు. ఢిల్లీ ఆర్థిక శాఖ బాధ్యతలు చూస్తున్న కైలాష్ గెహ్లాట్ ఈసారి బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టనున్నారు. 2015లో ఢిల్లీలో ఆప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక శాఖను ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా నిర్వహించారు. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సిసోడియా అరెస్ట్ కావడంతో.. తన మంత్రిత్వ శాఖకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. సిసోడియా రాజీనామాకు కేజ్రీవాల్ కూడా ఆమోదం తెలిపారు. ఇక, ఆప్ ఢిల్లీ పగ్గాలు చేపట్టిన తర్వాత మనీష్ సిసోడియా బడ్జెట్‌ను సమర్పించకపోవడం ఇదే తొలిసారి.
సిసోడియా రాజీనామాతో రెవెన్యూ శాఖ మంత్రి కైలాష్ గెహ్లాట్‌కు ఆర్థిక శాఖ బాధ్యతలు అప్పగించారు. దీంతో బడ్జెట్‌కు సంబంధించి గెహ్లోట్ ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులతో అనేక సమావేశాలు నిర్వహించారు. సిసోడియా అరెస్టుకు ముందు కూడా గెహ్లోట్ బడ్జెట్ సంబంధిత సమావేశాల్లో భాగంగా ఉన్నారు.ఇక, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రసంగంతో అసెంబ్లీ బడ్జెట్ సెషన్ ప్రారంభం కానుంది.
గతేడాది మార్చి 26న వార్షిక బడ్జెట్ 2022-23ను సిసోడియా సమర్పించారు. దానిని రోజ్‌గార్ బడ్జెట్ అని పిలిచారు. రూ. 75,800 కోట్లతో ఆ బడ్జెట్.. వివిధ కార్యక్రమాల ద్వారా 20 లక్షల ఉద్యోగాలను సృష్టించడానికి ఐదు సంవత్సరాల ప్రణాళికతో రూపొందించబడింది. ఇక, సిసోడియా మాత్రమే కాకుండా మనీలాండరింగ్ కేసులో జైలులో ఉన్న సత్యేందర్ జైన్ కూడా మంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.