delhi air pollution : ఢిల్లీలో మ‌ళ్లీ దిగజారిన గాలి నాణ్యత.. నగరాన్ని కమ్మేసిన పొగమంచు

By team teluguFirst Published Jan 14, 2022, 2:47 PM IST
Highlights

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం మళ్లీ పెరిగింది. ఢిల్లీలో గాలి నాణ్యత శుక్ర‌వారం మరింత దిగజారింది. ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నేడు ‘మోడరేట్’ కేటగిరీ నుండి ‘వెరీ పూర్’ స్థాయికి పడిపోయింది.
 

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగింది. ఢిల్లీలో గాలి నాణ్యత శుక్ర‌వారం మరింత దిగజారింది. సిస్టం ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్ అండ్ రీసెర్చ్ (SAFAR) ప్రకారం.. ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) నేడు ‘మోడరేట్’ కేటగిరీ నుండి ‘వెరీ పూర్’ స్థాయికి పడిపోయింది. ఢిల్లీ నగరం మొత్తం  AQI 312గా నమోదయ్యింది. 
 
జనవరి 9 నుంచి 11 వరకు వరుసగా మూడు రోజుల పాటు దేశ రాజధానిలో గాలి నాణ్యత  ‘సాటిస్ఫెక్టరీ’ (satisfactory)  కేటగిరీలో నమోదైంది. అయితే జనవరి 12న ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) `మోడరేట్` కేటగిరీకి పడిపోయింది. ఇదిలా ఉండ‌గా.. నోయిడా, గురుగ్రామ్‌లలో గాలి నాణ్యత `పూర్` కేటగిరీలో న‌మోదైంది. నోయిడాలో AQI 262 వద్ద ఉండగా, గురుగ్రామ్ యొక్క AQI 256 వద్ద న‌మోదైంది. 

శుక్రవారం ఉదయం నుంచే దేశ రాజధాని ఢిల్లీని దట్టమైన పొగమంచు కమ్మేసింది. నగరం చలిగాలులు వీస్తున్నందున మంచు పొర ఏర్ప‌డింది. ఫ‌లితంగా ఉద‌యం తొమ్మిదిన్న‌ర గంట‌ల వ‌ర‌కు కూడా కొన్ని ప్రాంతాలల్లో రోడ్ల‌పై మ‌స‌క‌గానే క‌నిపించింది. దీంతో వాహ‌నాదారులు తీవ్ర ఇబ్బందులు ప‌డ్డారు. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం.. ఢిల్లీలోని పాలెం వద్ద ఉదయం 4.30 నుండి 9.30 గంటల వరకు విసిబిలిటీ రేట్ 50 మీట‌ర్ల‌కు ప‌డిపోయింది. అలాగే సఫ్దర్‌జంగ్‌లో ఉదయం 7 గంటల నుండి 9.30 గంటల వరకు విసిబిలిటీ రేట్ 50-100 మీటర్ల మధ్య మాత్ర‌మే ఉంది. 

ఢిల్లీ న‌గ‌రంలో గురువారం కనిష్ట ఉష్ణోగ్రత 5.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది, ఇది ఈ సీజన్ సగటు కంటే కూడా చాలా తక్కువ. గరిష్ట ఉష్ణోగ్రత 16.7 డిగ్రీల సెల్సియస్ గా నిలిచిపోయింది.ఇది కూడా సాధారణం కంటే మూడు డిగ్రీలు తక్కువగా నమోదైంది భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 4-5 రోజులలో ఉత్తర భారతదేశంలో దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. పశ్చిమ హిమాలయ ప్రాంతం, అస్సాం, మేఘాలయ,  నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలలో రాబోయే రెండు రోజులలో, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, త్రిపురలలో రాత్రి, ఉదయం సమయాల్లో అతి దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. 

కేట‌గిరిల‌ను  ఎలా నిర్ణ‌యిస్తారు..? 
సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్ అండ్ రీసెర్చ్ (SAFAR) గాలి నాణ్య‌త విభాగాల‌ను, కేట‌గిరీల‌ను నిర్ణ‌యిస్తుంది. దాని ప్రకారం ఎయిర్ క్వాలిటీ 51 నుంచి 100 AQI గా న‌మోదైతే ‘సాటిస్ఫెక్టరీ’ 
(satisfactory)’ లేదా  ‘గుడ్’ (good) గా పరిగణిస్తుంది. 101-200 AQI గా నమోదైతే ‘మోడరేట్’ (moderate) గా పరిగణిస్తుంది. అలాగే 201-300 AQI గా నమోదైతే ‘పూర్’ (por)  కిందకు వస్తుంది. అలాగే 300-400 AQI గా నమోదైతే ‘వెరీ పూర్’ (very poor)గా పరిగణిస్తుంది. అయితే 401-500 మధ్యన నమోదైతే మాత్రం ‘డేంజరస్’  (dangers) కేటగిరి కిందకు వస్తుంది. 

click me!