
ఉత్తరాఖండ్‌లోని పౌరీ గర్వాల్ జిల్లాలో బస్సు లోయలో పడిపోయిన ఘటనలో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఇప్పటివరకు కనీసం 32 మంది మృతిచెందగా, మరో 20 మందికి గాయాలు అయినట్టుగా సమాచారం. ఘటన స్థలంలో ఎన్టీఆర్ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. వివరాలు.. హరిద్వార్‌లోని లాల్‌ధాంగ్ నుంచి కందగావ్ మీదుగా పౌరీ జిల్లా బీర్‌ఖాల్ బ్లాక్‌కు వస్తున్న బస్సులో 55 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే బస్సు పౌరీ జిల్లాలోని ధూమకోట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిమ్ది గ్రామ సమీపంలో అదుపు తప్పి 500 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. ప్రమాదానికి గురైన బస్సులో పెళ్లి బృందం ప్రయాణిస్తోంది.
ఈ విషయం తెలిసిన వెంటనే ధూమకోట్ పోలీస్ స్టేషన్ అధికారులు.. సంఘటనా స్థలానికి చేరుకున్నారు. లోయలో పడిపోయిన వారిని రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. ఎన్టీఆర్ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి రాష్ట్ర విపత్తు నిర్వహణ కేంద్రానికి చేరుకున్నారు.
ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘‘ఉత్తరాఖండ్‌లోని పౌరీలో జరిగిన బస్సు ప్రమాదం హృదయాన్ని కదిలించింది. ఈ విషాద సమయంలో నా ఆలోచనలు మృతుల కుటుంబాలతో ఉన్నాయి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బాధితులకు అన్ని విధాలా సహాయం అందిస్తాం’’ అని మోదీ పేర్కొన్నారు.
ఈ ప్రమాదంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సంతాపం తెలిపారు. ఉత్తరాఖండ్‌లోని పౌరీ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం బాధకరమని అన్నారు. ఈ ఘటనలో తమ ఆత్మీయులను కోల్పోయిన వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ తీరని లోటును భరించే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్టుగా చెప్పారు.