రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడిపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. క్రీడా మంత్రిత్వ శాఖకు ఢిల్లీ మహిళా కమిషన్ నోటీసులు

By Sumanth KanukulaFirst Published Jan 19, 2023, 9:34 AM IST
Highlights

బీజేపీ ఎంపీ, రెస్టింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మహిళా రెజ్లర్‌లను లైంగికంగా వేధింపులకు గురిచేశారని రెజ్లర్ వినేష్ ఫోగట్‌తో సహా పలువురు ఆరోపించడం తీవ్ర కలకలం రేపుతోంది. 

బీజేపీ ఎంపీ, రెస్టింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మహిళా రెజ్లర్‌లను లైంగికంగా వేధింపులకు గురిచేశారని రెజ్లర్ వినేష్ ఫోగట్‌తో సహా పలువురు ఆరోపించడం తీవ్ర కలకలం రేపుతోంది. బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నుంచి ర్యాలీగా బయల్దేరి వెళ్లిన  సుమారు 30 మంది రెజ్లర్లు.. డబ్ల్యూఎఫ్ఐ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. ఈ పరిణామాలపై స్పందించిన ఢిల్లీ మహిళా కమిషన్.. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడ్రా మంత్రిత్వ శాఖతో పాటు ఢిల్లీ నగర పోలీసులకు నోటీసులు జారీ చేసింది.

మరోవైపు ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) చీఫ్ స్వాతి మలివాల్ కూడా జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న రెజ్లర్లను కలిశారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్, కొంతమంది రెజ్లింగ్ కోచ్‌లపై లైంగిక వేధింపుల ఆరోపణలపై మీడియాలో వచ్చిన నివేదికలను సుమోటోగా తీసుకున్నట్లు డీసీడబ్ల్యూ తెలిపింది. అలాగే ఈ వ్యవహారంపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని కూడా మహిళా కమిషన్ పోలీసులను కోరింది.

‘‘రిపోర్టుల ప్రకారం, భారతదేశానికి చెందిన ప్రఖ్యాత మహిళా ఒలింపియన్ రెజ్లర్లు.. డబ్ల్యూఎఫ్‌ఐ ప్రెసిడెంట్, కొంతమంది కోచ్‌లు మహిళా రెజ్లర్‌లను లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపించారు. ఇది చాలా తీవ్రమైన విషయం’’ ఢిల్లీ మహిళా కమిషన్ పేర్కొంది. 

జనవరి 21 నాటికి కోచ్‌లు, డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షులపై మహిళా రెజ్లర్లు చేసిన ఫిర్యాదుల కాపీని కూడా కోరింది. అలాగే జనవరి 21 నాటికి వాటిపై తీసుకున్న చర్యల వివరాలతో పాటు, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన అంతర్గత ఫిర్యాదుల కమిటీ వివరాలను కూడా అడిగింది. వర్క్‌ప్లేస్‌లో మహిళలపై లైంగిక వేధింపుల (నివారణ, నిషేధం మరియు పరిష్కారం) చట్టం 2013 ప్రకారం ఈ ఫిర్యాదులు ఐసీసీ, స్థానిక ఫిర్యాదు కమిటీ (ఎల్‌సీసీ)కి ఫార్వార్డ్ చేయబడ్డాయా? లేదా? తెలుపాలని కోరింది. 

Also Read: లైంగికంగా వేధిస్తున్నారు.. చంపుతామని బెదిరిస్తున్నారు.. రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిపై రెజ్లర్ల ఆరోపణలు

ఇక,  బ్రిజ్ భూషణ్ తో పాటు జాతీయ కోచ్‌లు తమను లైంగికంగా వేధిస్తున్నారని, మాట వినకపోతే చంపేస్తామని బెదిరిస్తున్నారని మహిళా రెజర్లు సంచలన ఆరోపణలు చేస్తున్నారు.  ఈ ఆరోపణలు  చేసినవారిలో  భారత స్టార్ రెజ్లర్  వినేశ్ ఫోగట్ కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే ధర్నా కూడా నిర్వహించారు. వినేశ్ పోగట్ తో పాటు  భారత స్టార్ రెజ్లర్లు భజరంగ్ పూనియా, సాక్షి మాలిక్, సంగీత పోగట్,  సుమిత్ మాలిక్ వంటి స్టార్ రెజ్లర్లు కూడా ఈ ధర్నాలో పాల్గొన్నారు.  ‘మహిళా రెజ్లర్లను   బ్రిజ్ భూషణ్, జాతీయ కోచ్ లు లైంగికంగా వేధిస్తున్నారు.  ఒలింపిక్స్ లో నా ప్రదర్శన తర్వాత నన్ను  ఎందుకూ పనికిరావని తిట్టారు.  బ్రిజ్ భూషణ్ వేధింపుల వల్ల నేను మానసిక క్షోభకు గురయ్యా.  ఒకసారి ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నా.. మాకు గాయాలైతే పట్టించుకునే నాథుడే లేడు.  ఆయనపై ఫిర్యాదు చేసినందుకు గాను నన్ను చంపేస్తానని బెదిరింపులు కూడా వచ్చాయి’ అని వినేశ్ ఫోగట్ కన్నీటి పర్యంతమైంది.  

click me!