అమానుషం.. పెళ్లి ఊరేగింపులో గుర్రం ఎక్కాడని.. దళిత వరుడిపై రాళ్లదాడి

By Rajesh KarampooriFirst Published Jun 7, 2023, 1:16 AM IST
Highlights

మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఛతర్‌పూర్ జిల్లాలో ఓ దళిత యువకుడి పెళ్లి ఊరేగింపుపై రాళ్ల దాడి జరిగింది. అగ్రకులానికి చెందిన కొందరు స్థానికులు ఈ దాడికి పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

“గుణం లేనివాడు కులం గొడుగు పడతాడు. మానవత్వం లేనివాడు మతం ముసుగు వేస్తాడు. పసలేని వాడు ప్రాంతం ఊసేత్తుతాడు. “ మహాకవి జాషువా కొన్ని దశాబ్దాల క్రితం రాసుకున్న మాటలివి. ఈ మాటలు వర్తమాన సమాజానికి కూడా సరిగ్గా సరిపోతాయి.  తరాలు ఎన్ని మారినా  కులరక్కసి సమాజాన్ని కలుషితం చేస్తోంది. ఇంకా కొందరూ కులాలు, మతాలని పట్టుకుని వేలాడుతున్నారు. దేశంలో ఎదోక్క చోట కుల వివక్ష కోరలు విప్పి బుసులు కొడుతూనే ఉంది. నిమ్నకులాల వారు ఉన్నతంగా బతుకుదామనుకుంటే.. అగ్రవర్ణాల వారు జీర్ణించుకోలేకపోతున్నారు. కొన్ని సందర్బాల్లో అవమానాలకు గురి చేస్తుంటే.. మరికొన్ని చోట్ల ఏకంగా దాడులకు తెగబడుతున్నారు. తాజాగా.. దళిత వర్గానికి చెందిన వరుడు పెళ్లి ఊరేగింపులో గుర్రం ఎక్కాడని అగ్రకులాలకు చెందిన కొందరూ వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ అమానుష ఘటన  మధ్యప్రదేశ్‌లోచోటుచేసుకుంది.  

వివరాల్లోకెళ్తే.. మధ్యప్రదేశ్ లోని ఛతర్‌పూర్ జిల్లాలో దళిత వరుడి పెళ్లి ఊరేగింపు జరుగుతోంది. ఈ సందర్భంగా వరుడిని గుర్రంపై ఊరేగిస్తున్నారు.బ్యాండ్ బాజాలు, బంధువులు,స్నేహితుల ఆకట్టుకునే డ్యాన్సులతో కోలాహలంగా ఈ వేడుక నిర్వహిస్తుంటారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అగ్రవర్ణాలకు చెందిన 20-25 మంది వరుడిపై రాళ్లతో దాడి చేశారు. అనంతరం గుర్రంపై నుంచి కిందికి లాగి కర్రలతో విచక్షణా రహితంగా చితకబాదారు. ఎస్పీ నేతృత్వంలో పోలీసు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ  పట్టించుకోకుండా రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు కూడా గాయపడ్డారు. దాడికి పాల్పడిన 50 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
 
నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి చట్టం 1989,  ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ల కింద దాడి, అల్లర్లు, రాళ్లదాడి, ఆస్తి నష్టం వంటి సెక్షన్ల కింద అభియోగాలు మోపినట్లు ఎస్పీ అమిత్ సంఘీ  తెలిపారు. గ్రామంలో శాంతిభద్రతలు నెలకొల్పేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు.  అయితే మధ్యప్రదేశ్‌లో ఇలాంటి ఘటనలు కొత్తేమీ కాదు. అప్పుడప్పుడూ వెలుగుచూస్తూనే ఉంటాయి. ఫిబ్రవరిలో కూడా ఇదే తరహాలో ఘటన జరిగింది. ఓ కానిస్టేబుల్ పెళ్లికి గుర్రంపై వెళ్లకుండా అడ్డుకున్న ఘటన ఈ జిల్లాలో చోటుచేసుకుంది. అతని ఊరేగింపుకు పోలీసు రక్షణ ఇవ్వాల్సి వచ్చింది.  

click me!