Cyclone Michaung: డిసెంబర్ 5న నెల్లూరు-మచిలీపట్నం మధ్య దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం దాటనున్న మిచౌంగ్ తుఫాను ప్రభావంతో గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
Cyclone Michaung: ఆంధ్రప్రదేశ్ లో మిచౌంగ్ తుఫాను ప్రభావం కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుఫాను ప్రభావం నెల్లూరు జిల్లాపై తీవ్ర ప్రభావం చూపడంతో భారీ వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. మౌచింగ్ తుఫాను కారణంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఓడిశాల్లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై, నెల్లూరులో పరిస్థితులు దారుణంగా మారాయి. చాలా ప్రాంతాలు నీట మునిగాయి. జనజీవనం స్తంభించిపోయింది.
మిచౌంగ్ తుఫాను తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. ఈ తుఫాను డిసెంబర్ 5న నెల్లూరు-మచిలీపట్నం మధ్య దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ సమయంలో గంటకు 100 కిలోమీటర్ల వేగంతో తీవ్ర గాలులు వీస్తాయని పేర్కొంది. ఈ తుఫాను ప్రభావంతో దక్షిణ ఒడిశాతో పాటు కోస్తా ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సంబంధిత అధికారులు తెలిపారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం తీవ్ర తుఫానుగా మారిందనీ, దీనికి మిచౌంగ్ తుఫానుగా నామకరంన చేసినట్టు అంతకుముందు అధికారులు తెలిపారు. ఈ మిచౌంగ్ తుఫాను ఆదివారం తీవ్రరూపం దాల్చింది. ఆదివారం ఉదయం 5.30 గంటల సమయానికి పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 300 కిలోమీటర్లు, చెన్నైకి ఆగ్నేయంగా 310 కిలోమీటర్లు, నెల్లూరుకు ఆగ్నేయంగా 440 కిలోమీటర్లు, బాపట్లకు ఆగ్నేయంగా 550 కిలోమీటర్లు, మచిలీపట్నానికి ఆగ్నేయంగా 550 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమై ఉంది.
అంతకుముందు, తుఫాను ప్రభావంతో డిసెంబర్ 4, 5, 6 తేదీల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో విస్తారంగా, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు. నష్టాన్ని తగ్గించుకోవడానికి రైతులు తమ పంటలను వెంటనే కోయాలని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ సూచించారు. తుఫాను కోస్తాంధ్ర వైపు పయనిస్తే వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాబోయే మూడు రోజుల పాటు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.