బిప‌ర్జోయ్ తుఫాను: ఐఎండీ రెడ్ అల‌ర్ట్.. గుజరాత్ తీర ప్రాంతాల నుంచి 37 వేల మంది సురక్షిత ప్రాంతాలకు త‌ర‌లింపు

Published : Jun 14, 2023, 11:50 AM IST
బిప‌ర్జోయ్ తుఫాను: ఐఎండీ రెడ్ అల‌ర్ట్.. గుజరాత్ తీర ప్రాంతాల నుంచి 37 వేల మంది సురక్షిత ప్రాంతాలకు త‌ర‌లింపు

సారాంశం

Cyclone Biparjoy: బిపర్జోయ్ తుఫాన్ నేప‌థ్యంలో గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ప్ర‌స్తుత తుఫాను ప‌రిస్థితుల‌పై సమీక్ష నిర్వహించారు. ఈ క్ర‌మంలోనే సౌరాష్ట్ర, కచ్ తీరాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ ప్ర‌క‌టించింది. కాగా, దాదాపు 60 ఏళ్లలో పశ్చిమ తీరాన్ని తాకిన మూడో తీవ్ర‌ తుఫాన్ బిపర్జోయ్ అని రిపోర్టులు పేర్కొంటున్నాయి.   

Cyclone Biparjoy-IMD issues red alert: బిపర్జోయ్ తుఫాన్ సన్నద్ధతపై గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ బుధవారం గాంధీనగర్ లోని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ లో సమీక్ష నిర్వహించారు. మరోవైపు బిపర్జోయ్ తుఫాను నేపథ్యంలో పశ్చిమ రైల్వే బుధవారం గుజరాత్-ముంబ‌యి మధ్య న‌డిచే పలు రైళ్లను రద్దు చేసింది. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో గురువారం సాయంత్రం జఖౌ సమీపంలో తీరం దాటనున్న బిపర్జోయ్ తుఫాను విపత్కర ప్రభావాన్ని అంచనా వేస్తూ పలు ప్రభుత్వ సంస్థలు తీరప్రాంత జిల్లాలైన సౌరాష్ట్ర, కచ్ లలో సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ముందుకు సాగుతోంద‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. గుజరాత్ లోని ఎనిమిది జిల్లాల్లో సముద్రం సమీపంలో నివసిస్తున్న దాదాపు 37,800 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ప్రభుత్వం తెలిపింది. తీరానికి 10 కిలోమీటర్ల పరిధిలో నివసిస్తున్న ప్రజలను ఖాళీ చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఐఎండీ రెడ్ అల‌ర్ట్ 

బిపర్జోయ్ తుఫాను నేప‌థ్యంలో భార‌త వాతావ‌ర‌ణ శాఖ (ఐఎండీ) రెడ్ అలర్ట్ ప్ర‌క‌టించింది. గుజరాత్ లోని సౌరాష్ట్ర, కచ్ తీరాలకు బిపర్జోయ్ తుఫాన్ హెచ్చరికలతో బుధవారం రెడ్ అలర్ట్ ఉత్వ‌ర్వులు జారీ చేసింది. ఇది దాదాపు ఈశాన్య దిశగా ప్రయాణించి జూన్ 15 సాయంత్రానికి జాఖౌ పోర్టు (గుజరాత్) సమీపంలో మాండ్వి (గుజరాత్), కరాచీ (పాకిస్తాన్) మధ్య సౌరాష్ట్ర, కచ్, దానిని ఆనుకుని ఉన్న పాకిస్తాన్ తీరాలను దాటే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. రాజ్ కోట్ లో సురక్షితం కాదని ప్రకటించిన రిలే టవర్ ను బిపర్జోయ్ తుఫాను కారణంగా కూల్చివేశారు.

గుజరాత్ తీర ప్రాంతాల నుంచి 37,800 మంది తరలింపు

బిపర్జోయ్ తుఫాన్ గుజరాత్ లోని కచ్ తీరం వైపు దూసుకుపోతున్నందున, రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో సముద్రం సమీపంలో నివసిస్తున్న దాదాపు 37,800 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ శక్తివంతమైన తుఫాను జూన్ 15 సాయంత్రం జఖౌ రేవు సమీపంలో తీరం దాటుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. అరేబియా సముద్రంలో వీఎస్సీఎస్ (అతి తీవ్రమైన తుఫాను) బిపార్జోయ్ ఉత్తర వాయవ్య దిశగా ప్రయాణించి, జూన్ 14 భారత కాలమానం ప్రకారం 2.30 గంటలకు జఖౌ ఓడరేవుకు 280 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. వీఎస్సీఎస్గా జూన్ 15 సాయంత్రానికి జాఖౌ పోర్టు (గుజరాత్) సమీపంలో దాటనుందని ఐఎండీ వ‌ర్గాలు తెలిపాయి. 

అరేబియా సముద్రం, బలూచిస్థాన్ తీర ప్రాంతంలో బిపర్జోయ్ తుఫాన్ బీభత్సం

అరేబియా సముద్రం, బలూచిస్థాన్ తీర ప్రాంతంలో బిపర్జోయ్ తుఫాన్ బీభత్సం కొన‌సాగుతోంది. అరేబియా సముద్రంలో బిపర్జోయ్ తుఫాను ప్ర‌భావం కొనసాగుతుండటం, మక్రాన్ బెల్ట్ సమీపిస్తుండటంతో బలూచిస్థాన్ ప్రభుత్వం ఆ ప్రావిన్స్ తీర ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.  మీర్ అబ్దుల్ ఖుద్దూస్ బిజెంజో ఆదేశాల మేరకు తీర ప్రాంతంలో 144 సెక్షన్ విధించిన‌ట్టు వార్తా సంస్థ పీటీఐ నివేదిక‌లు పేర్కొంటున్నాయి.

PREV
click me!

Recommended Stories

Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్