చికెన్ కొనే విషయంలో గొడవ, రాళ్లదాడి.. గ్రామంలో కర్ఫ్యూ..!!

By SumaBala BukkaFirst Published Jan 18, 2023, 6:52 AM IST
Highlights

ఉత్తరప్రదేశ్ లో చికెన్ కొనే విషయంలో రెండు వర్గాలమధ్య గొడవ చెలరేగింది. అది కాస్తా రాళ్లదాడిగా మారి ఇద్దరికి గాయాలయ్యాయి. దీంతో గ్రామంలో కర్ఫ్యూ విధించారు. 

ఉత్తరప్రదేశ్ : ఉత్తరప్రదేశ్లో ఒక విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. చికెన్ కారణంగా గ్రామంలో కర్ఫ్యూ విధించాల్సిన  పరిస్థితి  నెలకొంది. సోమవారం రాత్రి ఉత్తరప్రదేశ్లోని అలీగల్ జిల్లాలో ఈ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఇరు వర్గాల మధ్య చికెన్ కొనే విషయంలో ఘర్షణ మొదలై.. గొడవగా మారింది. దీంతో ఇరు వర్గాల్లోని వారు ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకుని దాడి చేసుకున్నారు.  ఈ దాడిలో ఇరు వర్గాల్లోని చాలామందికి గాయాలు కూడా అయ్యాయి.  గొడవకు సంబంధించి సమాచారం  అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.  వారిని వారించే ప్రయత్నం చేశారు.

పరిస్థితి ఉధృతంగా మారి చేయి దాటిపోతున్నట్టుగా కనిపించడంతో గ్రామంలో కర్ఫ్యూ విధించారు. అలీగడ్ జిల్లాలోని సరాయ్ సుల్తానీలో ఓ మాంసం దుకాణం ఉంది.  చికెన్ కొనడానికి ఇద్దరు యువకులు ఆ దుకాణానికి వెళ్లారు.  అయితే షాపు యజమానికి వారిద్దరికీ మధ్య వాగ్వాదం జరిగింది. అది చిలికి చిలికి గాలివానగా మారింది. ఎంతవరకు వెళ్లిందంటే, ఆ యువకులు, దుకాణదారుడు వర్గానికి చెందినవారు  పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని..  రాళ్ల దాడి చేసుకునేదాకా  వెళ్ళింది పరిస్థితి.

బంగారం అక్రమరవాణాలో స్మగ్లర్ల తెలివి చూస్తే షాకవ్వాల్సిందే !!

ఇది గమనించిన స్థానికులు ఎవరో పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఇరు వర్గాలను శాంతింప చేశారు.  గొడవ సద్దుమణిగేలా చేశారు. ఇరు వర్గాల పరస్పర రాళ్ల దాడిలో నలుగురు గాయపడ్డారు.  వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.  పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అదుపులోకి తెచ్చేందుకు.. గ్రామంలో కర్ఫ్యూ విధించారు. 

ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే కర్ణాటకలో డిసెంబర్ 14న జరిగింది. కర్ణాటకలోని బనశంకరిలో తాము ఆర్డర్ ఇచ్చిన ఐటమ్ ఇవ్వలేదని హోటల్ కే నిప్పుపెట్టారు దుండగులు. తాము అడిగిన చికెన్ రోల్ ఇవ్వలేదని విధ్వంసం సృష్టించారు అల్లరిమూక. ఈ ఘటన బెంగళూరు హనుమంత నగర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ దారుణమైన ఘటన వివరాల్లోకి వెళితే..  హనుమంత నగరలో కుమార్ హోటల్ ఉంది. దీనికి సోమవారం అర్ధరాత్రి దేవరాజ్ అనే రౌడీషీటర్ తన ఇద్దరు అనుచరులతో వెళ్ళాడు.

తాము తినడానికి చికెన్ రోల్ కావాలని ఆర్డర్ చేశారు. అయితే అప్పటికే హోటల్ సమయం ముగిసిపోవడంతో ఆ విషయాన్ని సిబ్బంది వారికి తెలిపారు. ఈ రోజు మెనూలో చికెన్ రోల్ కూడా లేదని.. హోటల్ బంద్ చేస్తున్నామని చెప్పారు. ఆశపడి తినడానికి వస్తే హోటల్ సిబ్బంది చెప్పిన సమాధానం వారికి కోపం తెప్పించింది. దీంతో రౌడీ షీటర్ అతని అనుచరులు సిబ్బందితో వాగ్వాదానికి దిగి, గొడవపడ్డారు. అప్పటికే మద్యం మత్తులో ఉండడంతో వారితో వాదించి విసిగిపోయి.. వారిని హోటల్ నుంచి బయటకు నెట్టేశారు సిబ్బంది. అంతకుముందే ఘర్షణలో వారిని చితకబాదారు.

అది రౌడీషీటర్, అతని అనుచరుల కోపాన్ని మరింత పెంచింది.. వెంటనే సమీపంలోని పెట్రోల్ బంకుకి వెళ్లారు.  రెండు లీటర్ల పెట్రోల్ తీసుకొచ్చారు. ఆ తర్వాత హోటల్ సిబ్బంది ఉన్న గది మీద పోసి దేవరాజ్ అనుచరులు నిప్పు పెట్టారు. మంటలు వ్యాపించడంతో గమనించిన సిబ్బంది బయటకు పరుగులు తీశారు. దీంతో వారి ప్రాణాలకు ప్రమాదం ఏమీ జరగలేదు. కానీ హోటల్ తలుపులు కిటికీలు కాలిపోయాయి.  ఈ ఘటన మీద హోటల్ సిబ్బంది స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దేవరాజ్, గణేష్ అనే ఇద్దరిని అరెస్టు చేశారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. అతని కోసం గాలిస్తున్నారు. 

click me!