55 ఏళ్ల కిందట కూలిపోయిన విమానం... ఇప్పుడు బయటపడింది

By Siva KodatiFirst Published Feb 23, 2019, 2:51 PM IST
Highlights

ప్రపంచ చరిత్రలో అంతు చిక్కని విమాన ప్రమాదాలు, అదృశ్యమైన విమానాలు ఎన్నో ఉన్నాయి. వాటి కోసం ఎంతగానో వెతికి చివరికి మిస్టరీగా వదిలేస్తారు. తాజాగా ఐదున్నర దశాబ్ధాల క్రితం సముద్రంలో కూలిపోయిన కోస్ట్ గార్డ్ విమానం ఇప్పుడు బయటపడింది. 

ప్రపంచ చరిత్రలో అంతు చిక్కని విమాన ప్రమాదాలు, అదృశ్యమైన విమానాలు ఎన్నో ఉన్నాయి. వాటి కోసం ఎంతగానో వెతికి చివరికి మిస్టరీగా వదిలేస్తారు. తాజాగా ఐదున్నర దశాబ్ధాల క్రితం సముద్రంలో కూలిపోయిన కోస్ట్ గార్డ్ విమానం ఇప్పుడు బయటపడింది.

వివరాల్లోకి వెళితే.. 1964 ఆగస్టు 13న చెన్నై కోస్ట్‌గార్డ్‌కు చెందిన చిన్న విమానం మద్రాస్ ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరి నీలాంగరై సమీపంలోని సముద్రంలో కూలిపోయింది.

అధికారులకు తెలియకుండా కోస్ట్‌గార్డ్‌కు చెందిన ఓ మెకానిక్ ఆ విమానాన్ని నడుపుతూ చివరికి ఎలా నేల మీదకు దించాలో తెలియక గాలిలో చక్కర్లు కొడుతూ సదరు విమానం సముద్రంలో కూలిపోయింది.

ఆ విమానాన్ని నడిపిన మెకానిక్‌ను మత్స్యకారులు కాపాడారు. తాజాగా తమిళనాడుకు చెందిన వివిధ ప్రాంతాల మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లినప్పుడు వారి వలలు దేనికో చిక్కుకుని తెగిపోవడాన్ని గమనించారు.

ఖరీదైన వలలు తరచు తెగిపోతూ నష్టపోతున్నామని మత్స్యశాఖ అధికారులకు చెప్పుకుని వాపోయారు. దీంతో కారణాన్ని అన్వేషించేందుకు పుదుచ్చేరికి చెందిన స్కూబా డైవింగ్ శిక్షకుడు అరవింద్ తరుణ్ శ్రీ నేతృతంలోని బృందం.. నీలాంగరై తీరంలో పదేళ్లుగా గాలిస్తున్నారు.

ఈ క్రమంలో ఫిబ్రవరి 17న నలుగురు స్కూబా డ్రైవర్లు, కొన్ని ఉపకరణాలు, చేపలు పట్టే 30 మరపడవలతో అన్వేషించారు. తీరం నుంచి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో సముద్రపు అడుగు భాగంలో తనిఖీలు చేపట్టారు.

సముద్రంలో 12 అడుగుల లోతున పాచిపట్టిన స్థితిలో విమాన శకలాలను గుర్తించారు. ఈ విషయాన్ని కోస్ట్‌గార్డ్, పౌర విమానయాన శాఖకు తెలియజేశారు. 

click me!