జోషిమఠ్ సంక్షోభం మధ్య ఉత్తరాఖండ్‌లోని కర్ణప్రయాగ్‌లోనూ ఇళ్లపై పగుళ్లు.. !

By Mahesh RajamoniFirst Published Jan 10, 2023, 12:56 PM IST
Highlights

Joshimath crisis: జోషిమఠ్ సంక్షోభం మధ్య, ఉత్తరాఖండ్ లోని కర్ణప్రయాగ్ లోని ఇళ్లపై పగుళ్లు కనిపించాయి. జోషిమఠ్ సమీపంలోని ఇతర గ్రామాలు కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాయని సితార్ గంజ్ ఎమ్మెల్యే సౌరభ్ బహుగుణ తెలిపారు.
 

Joshimath cracks: ఉత్త‌రాఖండ్ లోని జోషిమ‌ఠ్ లో  ప‌రిస్థితి మ‌రింత దిగ‌జారుతోంది. ఈ ప్రాంతాల్లో ఇప్ప‌టివ‌ర‌కు వ‌స్తున్న ప‌గుళ్ల సైజ్ సైతం పెరుగుతుండ‌టంపై ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. రాష్ట్ర ప్ర‌భుత్వంతో పాటు కేంద్ర ప్ర‌భుత్వం సైతం జోషిమ‌ఠ్ ప‌రిస్థితుల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు ఆరా తీస్తోంది. ప్ర‌జ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ముఖ్య‌మంత్రి పుష్క‌ర్ సింగ్ ధామి ఇప్ప‌టికే అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు. ప‌రిస్థితి దారుణంగా ఉన్న ప్రాంతాల నుంచి ప్ర‌జ‌ల‌ను త‌ర‌లించారు. వారికి అన్నివిధాల సాయం చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఇదిలావుండ‌గా, జోషిమఠ్ సంక్షోభం మధ్య, ఉత్తరాఖండ్ లోని కర్ణప్రయాగ్ లోని ఇళ్లపై పగుళ్లు కనిపించాయి. జోషిమఠ్ సమీపంలోని ఇతర గ్రామాలు కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాయని సితార్ గంజ్ ఎమ్మెల్యే సౌరభ్ బహుగుణ తెలిపారు.

వివ‌రాల్లోకెళ్తే.. ఉత్తరాఖండ్ లోని చమోలి జిల్లాలోని కర్ణప్రయాగ్ మునిసిపాలిటీలోని బహుగుణ నగర్ లో జోషిమఠ్ ప‌గుళ్లు స్థానికంగా ఆందోళ‌న‌ను పేంచుతున్నాయి. ప్ర‌జ‌లు భయాందోళన‌కు గుర‌వుతున్నారు. వార్తా సంస్థ ఏఎన్ఐ షేర్ చేసిన ఒక వీడియోలో, చుట్టుపక్కల ఇళ్లలో అనేక పగుళ్లు క‌నిపించిన దృశ్యాలు ఇప్పుడు వైర‌ల్ మారుతున్నాయి. 

 

| Chamoli, Uttarakhand: Amid the issue of land subsidence in Joshimath, cracks also seen on some houses in Bahuguna Nagar of Karnaprayag Municipality. pic.twitter.com/hwRfFcwhJy

— ANI UP/Uttarakhand (@ANINewsUP)

జోషిమఠ్ సమీపంలోని ఇతర గ్రామాలు కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాయని సితార్ గంజ్ ఎమ్మెల్యే సౌరభ్ బహుగుణ సోమవారం తెలిపారు. "జోషిమఠ్ లో బాధిత ప్రజలకు పునరావాసం కల్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. జోషిమఠ్ ప్రజల భద్రతకు మేము భరోసా ఇస్తున్నాము. జోషిమఠ్ సమీపంలోని గ్రామాలు ఇలాంటి పరిస్థితితో కొట్టుమిట్టాడుతున్నట్లు నాకు కాల్స్ వచ్చాయి. దీనిపై ముఖ్యమంత్రికి వివరిస్తాం" అని సితార్ గంజ్ ఎమ్మెల్యే తెలిపారు. ఇదిలావుండగా, కూలిపోయే ప్రమాదం ఉందని భావిస్తున్న జోషిమఠ్ లోని ఇళ్లు, హోటళ్లను అధికారులు మంగళవారం కూల్చివేయనున్నారు. 

రూర్కీలోని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ నిపుణులు హోటల్ మలారి ఇన్, హోటల్ మౌంట్ వ్యూ అనే రెండు హోటళ్లను మంగళవారం కూల్చివేయనున్నారు. అసురక్షిత జోన్ల నుంచి నివాసితులందరినీ సురక్షితంగా తరలించినట్లు అధికారులు తెలిపారు. చమోలీ డీడీఎంఏ  బులెటిన్ ప్రకారం, పవిత్ర పట్టణంలో ఇప్పటివరకు 600 కి పైగా ఇళ్లలో పగుళ్లు ఏర్పడ్డాయి. 81 కుటుంబాలు తాత్కాలికంగా నిర్వాసితులయ్యాయి. జోషిమఠ్ నగర పరిధిలో 213 గదులను తాత్కాలికంగా నివాసయోగ్యమైనవిగా గుర్తించామనీ, వాటి సామర్థ్యం 1191 అని అంచనా వేసింది.

పరిస్థితిని సమీక్షించడానికి జల్ శక్తి మంత్రిత్వ శాఖ నుండి ఒక బృందం సోమవారం జోషిమఠ్ కు చేరుకుంది. ఆస్తి నష్టాన్ని అంచనా వేయడానికి, సహాయక చర్యలలో స్థానిక పరిపాలనతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళే మార్గాన్ని సూచించడానికి కేంద్ర బృందం కూడా మంగళవారం వస్తుందని జిల్లా మేజిస్ట్రేట్ హిమాన్షు ఖురానా తెలిపారు. ఆదివారం, ఉత్తరాఖండ్ ప్రభుత్వం విపత్తు నిర్వహణ చట్టం కింద జోషిమఠ్ లోని మొత్తం తొమ్మిది మునిసిపల్ వార్డులను కొండచరియలు విరిగిపడే జోన్ గా ప్రకటించింది. ఈ ప్రాంతాల నుండి నివాసితులను ఖాళీ చేయించడం ప్రారంభించింది. తరలింపుతో పాటు, ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రజలను తరలించడం-పునరావాసంపై కూడా చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ప్రకారం, గౌచార్, పిపల్కోటి వంటి ప్రదేశాలను తరలించే అవకాశం ఉంది.

click me!