ఆ పిల్లలను చూశాకే నిర్ణయం.. అప్పటివరకు ఇలానే: చలిలో టీ షర్ట్‌తోనే యాత్ర సాగించడంపై రాహుల్ రియాక్షన్

By Sumanth KanukulaFirst Published Jan 10, 2023, 12:06 PM IST
Highlights

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం ఉత్తర భారతదేశంలో కొనసాగుతుంది. అయితే అక్కడ చలి తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ.. రాహుల్ గాంధీ టీ షర్ట్‌ ధరించే తన యాత్రలో ముందుకు సాగుతున్నారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం ఉత్తర భారతదేశంలో కొనసాగుతుంది. అయితే అక్కడ చలి తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ.. రాహుల్ గాంధీ టీ షర్ట్‌ ధరించే తన యాత్రలో ముందుకు సాగుతున్నారు. అయితే రాహుల్ గాంధీ ధరిస్తున్న టీ షర్ట్‌ లోపల థర్మల్ ఉందని  కొందరు ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే గజగజ వణికించే చలిలో కూడా తాను టీ షర్ట్ మాత్రమే ఎందుకు ధరిస్తున్నాననే దానిపై రాహుల్ గాంధీ వివరణ ఇచ్చారు. మధ్యప్రదేశ్‌లో  చిరిగిన బట్టలతో వణుకుతున్న ముగ్గురు పేద బాలికలను కలుసుకున్న తర్వాత పాదయాత్ర‌లో టీ షర్ట్స్ మాత్రమే ధరించాలని నిర్ణయించుకున్నానని రాహుల్ గాంధీ తెలిపారు. 

సోమవారం సాయంత్రం హర్యానాలోని అంబాలాలో స్ట్రీట్ కార్నర్ సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘‘ఈ తెల్లటి టీ షర్ట్ ఎందుకు వేసుకున్నావ్.. చలిగా అనిపించడం లేదా? అని చాలా మంది అడుగుతుంటారు. నేను వారికి ఒకటే కారణం చెబుతాను. యాత్ర ప్రారంభమైనప్పుడు.. కేరళలో వేడిగా, తేమతో కూడిన వాతావరణం ఉంది. కానీ మేము మధ్యప్రదేశ్‌లోకి ప్రవేశించిన సమయంలో వాతావరణం కాస్త చల్లగా ఉంది. ఒకరోజు చిరిగిన బట్టలతో ముగ్గురు పేద ఆడపిల్లలు నా దగ్గరకు వచ్చారు.. నేను వారిని పట్టుకున్నప్పుడు, వారు సరైన దుస్తులు ధరించకపోవడంతో వారు వణుకుతున్నారు. ఆ రోజు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను చలికి వణికేంతవరకూ టీ-షర్ట్ మాత్రమే ధరిస్తాను’’ అని చెప్పారు. 

అలాగే ఆ అమ్మాయిలకు సందేశం ఇవ్వాలనుకుంటున్నట్లు రాహుల్ గాంధీ చెప్పారు. ‘‘ఎప్పుడైతే నాకు వణుకు పుడుతుందో అప్పుడే స్వెటర్ వేసుకోవాలని ఆలోచిస్తాను.. మీకు చలిగా అనిపిస్తే రాహుల్ గాంధీకి కూడా చలి వస్తుందని ఆ ముగ్గురు అమ్మాయిలకు సందేశం ఇవ్వాలనుకుంటున్నాను’’ అని రాహుల్ అన్నారు. 

ఇదిలా ఉంటే.. ఉత్తరప్రదేశ్‌లో భారత్ జోడో యాత్ర కొనసాగుతున్న సమయంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. మీడియా తన వేషధారణను హైలైట్ చేస్తున్నప్పటికీ.. చిరిగిన బట్టలతో తన వెంట నడుస్తున్న పేద రైతులు, కూలీలను పట్టించుకోవడం లేదని అన్నారు. ‘‘నేను టీ షర్ట్‌లో ఉండటం అసలు ప్రశ్న కాదు, అసలు ప్రశ్న ఏమిటంటే దేశంలోని రైతులు, పేద కార్మికులు, వారి పిల్లలు స్వెటర్లు లేకుండా.. చిరిగిన బట్టలు, టీ షర్టులతో ఎందుకు ఉన్నారు’’ అని రాహుల్ ప్రశ్నించారు. 

click me!