త్రిపురలో కాంగ్రెస్‌తో సీపీఎం పొత్తు.. బీజేపీని ఎదుర్కోవడానికి వామపక్షం మంతనాలు

By Mahesh KFirst Published Dec 27, 2022, 4:33 PM IST
Highlights

ఈశాన్య రాష్ట్రం త్రిపురలో వచ్చే అసెంబ్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునే విషయంపై సీపీఎం ఆలోచనలు చేస్తున్నది. బీజేపీని ఎదుర్కోవడానికి, ఎమ్మెల్యేల సంఖ్య పెంచుకోవడానికి కాంగ్రెస్‌తో పొత్తు అంశంపై ఢిల్లీలో జరుగుతున్న పొలిట్‌బ్యూరో సమావేశంలో చర్చ ఉన్నట్టు తెలిసింది.
 

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలలో ఈశాన్య రాష్ట్రంలో త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ 25 ఏళ్లు పాలించిన సీపీఎం పార్టీని 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఐపీఎఫ్‌టీ కలిసి ఓడించాయి. ఆ రెండు పార్టీలు మూడింట రెండు వంతుల సీట్లను కొల్లగొట్టాయి. దీంతో సీపీఎం పార్టీ ప్రతిపక్షానికి పరిమితమైంది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ కార్యకర్తలపై దాడులు పెరిగాయని సీపీఎం ఆరోపిస్తున్నది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా మళ్లీ అధికారంలోకి రావాలని సీపీఎం ఆరాటపడుతున్నది. ఈ క్రమంలోనే ఆ పార్టీ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునే ఆలోచనలు చేస్తున్నట్టు తెలిసింది.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం పై ఢిల్లీలో సీపీఎం పొలిట్‌బ్యూరో సమావేశం జరుగుతున్నది. ఆ వ్యూహంలో కాంగ్రెస్‌తో పొత్తుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని సీపీఎం పార్టీ వర్గాలు కొన్ని వెల్లడించాయి. దీనిపై రాష్ట్ర యూనిట్ కూడా వచ్చే నెల అగర్తలాలో చర్చించనుంది.

బీజేపీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్‌తో జతకట్టే అవకాశాలను సీపీఎం పరిశీలిస్తున్నదని ఆ వర్గాలు తెలిపాయి. ఎమ్మెల్యేల సంఖ్యను పెంచుకోవడమే ఈ పొత్తు ప్రధాన లక్ష్యం అని వివరించాయి. అయితే, అన్ని రాష్ట్రాల యూనిట్ల అభిప్రాయాలు సేకరించి, భవిష్యత్ పరిణామాలను విశ్లేషించి ఈ పొత్తు పై తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపాయి.

Also Read: త్రిపుర అసెంబ్లీ ఎన్నిక‌లు.. ర‌థ‌యాత్ర చేప‌ట్ట‌నున్న బీజేపీ

ఈ పొత్తుపై తుది నిర్ణయం తీసుకున్న తర్వాత కాంగ్రెస్‌తో ప్రతిపాదన చేస్తామని, ఆ తర్వాత ఎన్నికలకు ముందే సీట్ల పంపకాలపై చర్చ ఉంటుందని వివరించాయి. ఇది రాజకీయ సర్దుబాటుగా, లేదా ఏకీకరణగా పరిగణించరాదని సీపీఎం భావిస్తున్నది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఐపీఎఫ్‌టీలు మొత్తం 60 సీట్లకు గాను 43 స్థానాలు గెలుచుకున్నాయి. అందులో బీజేపీ 35 సీట్లను గెలుచుకోగా.. ఐపీఎఫ్‌టీ 8 సీట్లను గెలుచుకుంది. కాగా, సీపీఎం 15 స్థానాలను గెలుచుకుంది. కాగా, కాంగ్రెస్ జూన్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో ఒకే ఒక్క సీటు గెలుచుకుంది.

కాంగ్రెస్‌తో పొత్తు అంశంతోపాటు ఎన్నికలను మాణిక్ సర్కార్ సారథ్యంలో ఎదుర్కోవాలా? అనే అంశంపైనా సీపీఎం మంతనాలు చేస్తున్నది. ఆయన త్రిపురలో సక్సెస్‌ఫుల్ సీఎంగా నిరూపించుకున్నారు. అయితే, కాంగ్రెస్‌తో పొత్తు సీపీఎంకు అంత సులువైన నిర్ణయం కాబోదు. ఎందుకంటే సీపీఎం అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కేరళలో దానికి ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్సే. ఈ నేపథ్యంలో సీపీఎం పార్టీకి కాంగ్రెస్ తో పొత్తు నిర్ణయం కష్టతరంగా ఉన్నది.

click me!