
కోవిడ్ వ్యాక్సినేషన్‌కు ఉద్దేశించిన కొవిన్ పోర్టల్ నుంచి వ్యాక్సిన్ వేయించుకున్న వ్యక్తుల వ్యక్తిగత వివరాలు లీక్ అయ్యాయనే ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. కొవిన్ పోర్టల్‌లోని సమాచారం లీకైనట్లు వస్తున్న వార్తలను కొట్టిపారేసింది. కేంద్ర ఆరోగ్య శాఖకు చెందిన కొవిన్ పోర్టల్ పూర్తి సురక్షితమైందని స్పష్టం చేసింది. కొవిన్ పోర్టల్‌లోని సమాచారం గోప్యంగా ఉందని వెల్లడించింది. డేటా ఉల్లంఘనకు సంబంధించిన అన్ని నివేదికలు ఎలాంటి ఆధారం లేకుండా ఉన్నాయని పేర్కొంది.
ఈ సమస్యను పరిశీలించి నివేదికను సమర్పించాల్సిందిగా ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In)ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కోరినట్టుగా కేంద్రం తెలిపింది. కొవిన్ పోర్టల్‌లో ఓటీపీ ప్రమాణీకరణ-ఆధారిత డేటా యాక్సెస్ మాత్రమే అందించబడుతుందని తెలిపింది. కోవిన్ పోర్టల్‌లోని డేటా భద్రతను నిర్ధారించడానికి అన్ని చర్యలు తీసుకోబడ్డాయని స్పష్టం చేసింది.
ఇక, కోవిన్ పోర్టల్‌లో డేటా టెలిగ్రామ్‌లో ప్రత్యక్షమైందని ప్రచారం జరిగింది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) సాకేత్ గోఖలే.. ట్విట్టర్‌లో రాజ్యసభ ఎంపీ, టీఎంసీ నేత డెరెక్ ఓబ్రెయిన్, మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరంతో సహా కొందరు ప్రముఖ ప్రతిపక్ష నాయకుల కొన్ని ప్రముఖ పేర్లను ప్రస్తావించి.. వారి వివరాలు ఇప్పుడు పబ్లిక్ డొమైన్‌లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. కొంతమంది జర్నలిస్టుల పేర్లను కూడా పేర్కొన్నారు. వారి ప్రైవేట్ సమాచారం కూడా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉందని చెప్పారు. ‘‘కోవిడ్-19 వ్యాక్సినేషన్ పొందిన ప్రతి భారతీయుడి వ్యక్తిగత వివరాలు ఈ లీకైన డేటాబేస్‌లో ఉచితంగా లభిస్తాయి’’ అని అన్నారు.