
కోవిడ్ వ్యాక్సినేషన్‌కు ఉద్దేశించిన కొవిన్ పోర్టల్ నుంచి వ్యాక్సిన్ వేయించుకున్న వ్యక్తుల వ్యక్తిగత వివరాలు లీక్ అయ్యాయని, సోషల్ మీడియాలో ప్రదర్శితమవుతున్నాయని ప్రతిపక్షాలు పేర్కొనడంపై కేంద్ర ప్రభుత్వంలోని ఉన్నత వర్గాలు స్పందించాయి. కొవిన్ పోర్టల్ పుట్టిన తేదీ, చిరునామాతో సహా ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత వివరాలను సేకరించదని ప్రభుత్వ ఉన్నత వర్గాలు సోమవారం తెలిపాయి. కొవిన్ పోర్టల్ నుంచి మేజర్ ప్రైవసీ ఉల్లంఘన జరిగిందని ప్రతిపక్ష నాయకులు పేర్కొన్న తర్వాత ఈ స్పందన వచ్చింది.
వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తుల వ్యక్తిగత వివరాలు, వారి మొబైల్ నంబర్‌లు, ఆధార్ నంబర్‌లు, పాస్‌పోర్ట్ నంబర్లు, ఓటరు ఐడీలు, కుటుంబ సభ్యుల వివరాలు లీక్ చేయబడ్డాయని, ఎవరైనా ఉచితంగా యాక్సెస్ చేసే విధంగా అందుబాటులో ఉన్నాయని ప్రతిపక్షాలు ఆరోపించారు. ఈ క్రమంలోనే స్పందించిన ప్రభుత్వ వర్గాలు.. ఒక వ్యక్తి ఒక డోస్ లేదా రెండు డోస్‌లు లేదా ప్రికాషనరీ డోస్‌ను స్వీకరించిన తేదీని మాత్రమే పోర్టల్ సేకరిస్తుందని తెలిపాయి. సమాచారాన్ని ప్రస్తుతం పరిశీలిస్తున్నట్టుగా పేర్కొన్నాయి.
ప్రతిపక్ష నాయకులు ఏమి ఆరోపించారు?
తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) సాకేత్ గోఖలే.. ట్విట్టర్‌లో రాజ్యసభ ఎంపీ, టీఎంసీ నేత డెరెక్ ఓబ్రెయిన్, మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరంతో సహా కొందరు ప్రముఖ ప్రతిపక్ష నాయకుల కొన్ని ప్రముఖ పేర్లను ప్రస్తావించి.. వారి వివరాలు ఇప్పుడు పబ్లిక్ డొమైన్‌లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. కొంతమంది జర్నలిస్టుల పేర్లను కూడా పేర్కొన్నారు. వారి ప్రైవేట్ సమాచారం కూడా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉందని చెప్పారు. ‘‘కోవిడ్-19 వ్యాక్సినేషన్ పొందిన ప్రతి భారతీయుడి వ్యక్తిగత వివరాలు ఈ లీకైన డేటాబేస్‌లో ఉచితంగా లభిస్తాయి’’ అని స్పష్టం చేశారు.