9 నెలలు దాటిన తర్వాతే ప్రికాషన్ డోస్.. పిల్లలకు జనవరి 1 నుంచి టీకా రిజిస్ట్రేషన్.. ఎలా నమోదు చేసుకోవాలంటే..

By Sumanth KanukulaFirst Published Dec 28, 2021, 10:06 AM IST
Highlights

15 నుంచి 18 ఏళ్ల  వారికి ప్రస్తుతానికి కొవాగ్జిన్ (Covaxin) టీకాను మాత్రమే అందిజేయనున్నట్టుగా కేంద్రం తెలిపింది. ఇందుకోసం జనవరి 1 నుంచి ఆన్‌లైన్‌లో కోవిన్ (CoWin) పోర్టల్‌లో వ్యాక్సినేషన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపింది. హెల్త్‌కేర్‌ వర్కర్లు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 60 ఏళ్లకు పైబడిన వారికి 60 ప్రాధాన్యత క్రమం జనవరి 10 నుంచి ప్రికాషన్ డోస్ (precaution dose) అందజేయనున్నారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్రం సోమవారం వెల్లడించింది. 

కోవిడ్ కొత్త వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో 15 నుంచి 18 ఏళ్ల పిల్లలకు కూడా వ్యాక్సిన్ వేయనున్నట్టుగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. జనవరి 3వ తేదీ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే ఇందుకు సంబంధించి కేంద్రం జనవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించనుంది. 15 నుంచి 18 ఏళ్ల వారు వ్యాక్సిన్ వేయించుకోవడానికి CoWin పోర్టల్‌లో ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్ స్వీకరించిన ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 60 ఏళ్ల కంటే ఎక్కువ వయసు వారికి జనవరి 10 నుంచి ప్రికాషన్ డోసు (ముందు జాగ్రత్త డోసు) ఇవ్వనున్నట్టుగా మోదీ పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే రెండో డోసు తీసుకున్న 9 నెలలు లేదా 39 వారాలు దాటిన తర్వాతే వారికి ప్రికాషన్ డోసు (precaution dose) అందజేయబడుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను సోమవారం కేంద్రం వెల్లడించింది. 

పిల్లలు రిజిస్ట్రేషన్ ఇలా..
15 నుంచి 18 ఏళ్ల  వారికి ప్రస్తుతానికి కొవాగ్జిన్ టీకాను మాత్రమే అందిజేయనున్నట్టుగా కేంద్రం తెలిపింది. ఇందుకోసం జనవరి 1 నుంచి ఆన్‌లైన్‌లో కోవిన్ యాప్‌లో వ్యాక్సినేషన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపింది. లేకపోతే జనవరి 3 నుంచి వ్యాక్సినేషన్ కేంద్రాల్లో (vaccination centres) ఆన్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చు. పిల్లలు తమ విద్యాసంస్థల ఐడీ కార్డులను ఉపయోగించి కూడా కోవిన్ పోర్టల్‌లో వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని నేషనల్ హెల్త్ అథారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆర్‌ఎస్ శర్మ తెలిపారు. 18 ఏళ్లు పైబడినవారు కోవిన్ యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుంటున్న మాదిరిగానే ఈ ప్రక్రియ కూడా ఉంటుందన్నారు. 

ఇక, టీకా పొందేందుకు 15 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారు.. అంటే 2007 లేదా అంతకంటే ముందు జన్మించిన వారు అర్హులని కేంద్రం మార్గదర్శకాల్లో పేర్కొంది. వారు కోవిన్ యాప్‌లో ఇప్పటికే ఉన్న ఖాతా ద్వారా గానీ, లేక కొత్త మొబైల్ నెంబర్ ద్వారా ఖాతాను సృష్టించుకోవచ్చని కేంద్రం వెల్లడించింది. ఇక, 15-18 ఏళ్ల వయస్సు ఉన్న 6 నుంచి 7 కోట్ల మంది పిల్లలు కోవాగ్జిన్ టీకాను పొందేందుకు అర్హులుగా ఉన్నట్టు అంచనా.

ప్రికాషన్ డోష్.. 
హెల్త్‌కేర్‌ వర్కర్లు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 60 ఏళ్లకు పైబడిన వారికి 60 ప్రాధాన్యత క్రమం జనవరి 10 నుంచి ప్రికాషన్ డోస్ అందజేయనున్నారు. అయితే ప్రికాషన్ డోసు తీసుకోవడానికి రెండో డోసు తీసుకుని 9 నెలలు లేదా 39 వారాలు పూర్తిచేసుకున్నవారే అర్హులని కేంద్రం మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. కోవిన్‌ యాప్‌‌లో నమోదైన రెండో డోస్‌ తీసుకున్న తేదీ ఆధారంగా ప్రికాషన్‌ డోస్‌కు అర్హత లభిస్తుందని పేర్కొంది. అర్హులైన వారికి రిజిస్టర్‌ మొబైల్‌ నంబర్‌కు మెసేజీ అందుతుంది. వీరు ఆన్‌లైన్‌తోపాటు ఆన్‌సైట్‌లోనూ టీకా కోసం రిజిస్టర్‌ చేసుకోవచ్చు.  

అయితే 60 ఏళ్లు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు ప్రికాషన్ డోస్ పొందడానికి.. వారి ఆరోగ్య సమస్యలను సైట్‌లో పొందుపరచాల్సి ఉంటుంది. డాక్టర్ నుంచి పొందిన సర్టిఫికేట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. ఇక, మూడు కోట్ల మంది హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లు ప్రికాషన్ డోస్‌ తీసుకోవడానికి అర్హులుగా అంచనా వేస్తున్నారు. 

60 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న మూడు కోట్ల మంది ప్రజలు కోమోర్బిడిటీలను కలిగి ఉంటారని అంచనా వేయబడినప్పటికీ, తొమ్మిది నెలల గ్యాప్‌ని బట్టి జనవరిలో మూడవ డోస్‌ని స్వీకరించడానికి చాలా కొద్దిమంది మాత్రమే అర్హులు. 60 ఏళ్లకు పైబడిన 3 కోట్ల మంది ప్రజలు దీర్ఘకాలిక వ్యాధులు కలిగిన ఉంటారని అంచనా వేస్తున్నప్పటికీ.. వారిలో రెండు డోసుల టీకా తీసుకుని 9 నెలల పూర్తి చేసుకన్న వారి సంఖ్య తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇక, గతంలో రెండు డోసులు తీసుకున్న వ్యాక్సిన్‌నే precaution dose లేదా మూడో డోసుగా అందించాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

click me!