
కర్ణాటకలో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. కరోనా పాజిటివ్ వచ్చిన ఓ వ్యక్తి అంబులెన్స్ ను చూసి పారిపోయాడు. కర్ణాటక హావేరీలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెడితే...
గ్రామంలోకి వచ్చిన అంబులెన్స్ ను చూసి ఓ కరోనా రోగి పారిపోయాడు. కబ్బూరు తండాకు చెందిన ఈ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. హోం ఐసోలేషన్ లో ఉండకుండా అతడు బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారు.
అంతేకాదు లక్షణాలు కనిపిస్తున్నాయి. కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఇది గమనించిన గ్రామస్తులు అతన్ని హెచ్చరించారు. ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకోమని కోరారు. అయినా అతను ఎవరిమాటా వినలేదు.
అతని ఒక్కడివల్ల గ్రామంలోని అందరూ ఇబ్బంది పడతారని భావించిన గ్రామస్తులు అతన్ని ఎలాగైనా ఆస్పత్రికి తరలించాలని భావించారు. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రికి సమాచారం అందించారు.
సమాచారం అందుకుని అతన్ని ఆస్పత్రికి తరలించడానికి గ్రామంలోకి అంబులెన్స్ వచ్చింది. దీన్ని గమనించిన సదరు వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు. అంబులెన్స్ సిబ్బంది, గ్రామస్తులు ఎంత గాలించినా కూడా ఆ వ్యక్తి కనిపించలేదు.