భారత్‌లో కరోనా Third Wave.. బీ అలర్ట్.. కోవిడ్‌ వర్కింగ్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ ఎన్‌కే ఆరోరా

By Sumanth KanukulaFirst Published Jan 4, 2022, 2:39 PM IST
Highlights

గత వారం రోజులుగా భారత్‌లో కోవిడ్ కేసుల్లో (Covid cases) భారీగా పెరుగుదల కనిపిస్తుంది. ఒమిక్రాన్ కేసుల కూడా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే దేశంలో కోవిడ్-19 థర్డ్ వేవ్ (third wave) మొదలైందని  NTAGI కోవిడ్‌ వర్కింగ్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ ఎన్‌కే ఆరోరా (NK Arora) చెప్పారు.

గత వారం రోజులుగా భారత్‌లో కోవిడ్ కేసుల్లో (Covid cases) భారీగా పెరుగుదల కనిపిస్తుంది. ఒమిక్రాన్ కేసుల కూడా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే దేశంలో కోవిడ్-19 థర్డ్ వేవ్ (third wave) మొదలైందని  NTAGI కోవిడ్‌ వర్కింగ్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ ఎన్‌కే ఆరోరా (NK Arora) చెప్పారు. ‘గత వారం రోజులుగా దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య భారీగా పెరగడం కోవిడ్ థర్డ్ వేవ్‌ను సూచిస్తోంది. ఇది ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో కనిపిస్తుంది’ అని ఎన్‌కే అరోరా తెలిపారు. భారతదేశంలోని ప్రధాన నగరాల్లో నమోదైన తాజా కేసుల్లో 50 శాతానికి పైగా కేసులకు ఓమిక్రాన్ వేరియంట్ కారణమని కూడా ఆయన అన్నారు. 

‘భారతదేశంలో గత 7 నుంచి 10 రోజులలో కోవిడ్ ఇన్ఫెక్షన్ కేసులు చూస్తుంటే.. మనం అతి త్వరలో మూడవ వేవ్ పీక్‌కి చేరుకోవచ్చని నేను భావిస్తున్నాను’ అని డాక్టర్ ఎన్‌కే ఆరోరా చెప్పారు. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. దేశంలో 80 శాతానికి పైగా ప్రజలు సహజంగానే వైరస్ బారిన పడ్డారని అన్నారు. దేశంలో 90 శాతం కంటే ఎక్కువ మంది పెద్దలు కనీసం ఒక్క డోసు వ్యాక్సిన్ పొందారని ఆయన తెలిపారు. అర్హులైన పెద్దల్లో 65 శాతానికి పైగా రెండు డోసులు వ్యాక్సిన్ వేయించుకున్నారని చెప్పారు. 

‘దక్షిణాఫ్రికాలో  ఒమిక్రాన్ వేవ్ ప్రవర్తనను మనం పరిశీలిస్తే, అది వేగంగా పెరిగింది. రెండు వారాల్లో కేసుల సంఖ్య తగ్గడం ప్రారంభమైంది. ఒమిక్రాన్ కేసులలో చాలా వరకు ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేకుండా పోయింది. ఒమిక్రాన్ కేసుల్లో లక్షణాలు లేకపోవడం, తేలికపాటి అనారోగ్యం ఉన్నవే ఎక్కువ. ఈ కారకాలు అన్ని.. దక్షిణాఫ్రికాలో ఓమిక్రాన్ వేవ్ త్వరలో తగ్గుముఖం పట్టవచ్చని సూచిస్తున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుంటే.. థర్డ్ వేవ్‌‌కు సంబంధించినంత వరకు భారత్‌లో కొంతవరకు ఇలాంటి నమూనాను మనం చూడవచ్చు’ అని ఎన్‌కే అరోరా చెప్పారు.

ఇక, దేశంలో గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 37,379 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3,49,60,261కి చేరాయి. తాజాగా 124 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో మొత్త క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 4,82,017 చేరింది. నిన్న 11,007 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 3,43,06,414కు పెరిగింది. ప్ర‌స్తుతం దేశంలో 1,71,830 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

click me!