
బెంగుళూరు: ప్రేమ జంట పారిపోవడంతో యువకుడి ఇంటికి యువతి కుటుంబ సభ్యులు నిప్పు పెట్టారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకొంది. కర్ణాటకలోని బెంగళూరు నగర జిల్లా పరిధిలోని ఆనేకల్ తాలూకాలోని సర్జాపుర పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం నాడు ఈ ఘటన చోటు చేసుకొంది. గోణీఘట్టపురలో నివాసం ఉండే రాహుల్ (28) మారతహళ్లిలో రేఖ (22) దూరపు బంధువులు . వీరిద్దరూ 8 ఏళ్లుగా ప్రేమించుకొంటున్నారు.
ఈ విషయం రాహుల్ కుటుంబసభ్యులకు తెలిసింది. రేఖను తమ కొడుకు ఇచ్చి పెళ్లి చేయాలని రేఖ కుటుంబసభ్యులను రాహుల్ పేరేంట్స్ కోరారు. అయితే దీనికి రేఖ కుటుంబసభ్యులు నిరాకరించారు.తమ ప్రేమకు పెద్దలు నిరాకరిస్తున్నారని భావించిన రేఖ, రాహుల్ ఈ నెల 1వ తేదీన ఇంటి నుండి పారిపోయారు. ఈ విషయాన్ని గుర్తించిన రేఖ కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయినా కూడ ప్రయోజనం లేకుండా పోయింది. వారం రోజులైనా రేఖ ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో తమ కూతురి ఆచూకీని తెలపాలని కోరుతూ రాహుల్ ఇంటికి వెళ్లారు. అయితే అప్పటికి రాహుల్ కుటుంబసభ్యులు కూడ తమ ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు.
రాహుల్ ఇంటికి తాళం వేసిన విషయాన్ని గుర్తించిన వెంటనే రేఖ ఫ్యామిలీ మెంబర్స్ పెట్రోల్ పోసి ఆ ఇంటికి నిప్పంటించారు.ఇంట్లోని వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి.ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే ఫైరింజన్లు వచ్చి మంటలను ఆర్పివేశాయి.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.