WHO: యూరప్ దేశాలు, అమెరికాలో BA.4, BA.5 వేరియంట్ల ప్రభావం కొనసాగుతున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) పేర్కొంది. భారత్ లో కొత్త ఉప వేరియంట్ BA.2.75ని గుర్తించినట్టు వెల్లడించింది.
New Covid Sub-Variant BA 2.75: కరోనా మహమ్మారి రూపాంతరం చెందుతూ మరింత ప్రమాదకర వేరియంట్లు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. కరోనా వ్యాప్తి ఉధృతి మళ్లీ పెరుగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే అత్యంత ప్రమాదకరమైన వేరియంట్‌గా అంచనాలున్న ఒమిక్రాన్ కు చెందిన మరో కొత్త సబ్ వేరియంట్ BA.2.75ను భారత్ లో గుర్తించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. దీనిపై దృష్టి సారించామనీ, దీని ప్రభావం, వ్యాప్తిపై పరిశోధనలు సాగిస్తున్నామని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ తెలిపారు. "COVID-19లో ప్రపంచవ్యాప్తంగా నివేదించబడిన కేసులు గత రెండు వారాల్లో దాదాపు 30 శాతం పెరిగాయి. WHO ఉప-ప్రాంతాలైన ఆరింటిలో నాలుగులో గత వారంలో కేసులు గణనీయంగా పెరిగాయి" అని ఘెబ్రేయేసస్ మీడియతో అన్నారు. ప్రస్తుతం యూరప్ దేశాలతో పాటు అమెరికాలో BA.4, BA.5 వేరియంట్ల వ్యాప్తి కొనసాగుతున్నదని తెలిపియన ఆయన.. భారత్ సహా మరికొన్ని దేశాల్లో సబ్ వేరియంట్ BA.2.75 గుర్తించామనీ, దీని గురించి పరిశోధిస్తున్నామని తెలిపారు.
కరోనా Omicron సబ్-వేరియంట్ BA.2.75 పుట్టుకపై WHO చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన వీడియోలో BA.2.75 అని పిలవబడే ఒక ఉప-వేరియంట్ ఆవిర్భావం ఉందని చెప్పారు. దీనిని మొదట భారత్ లో గుర్తించామని తెలిపారు. ఆ తర్వాత ఈ వేరియంట్ మరో 10 దేశాల్లో వెలుగులోకి వచ్చిందని తెలిపారు. అయితే, దీనిపై విశ్లేషించడానికి పరిమిత సీక్వెన్సులు ఇంకా అందుబాటులో ఉన్నాయని ఆమె చెప్పారు, "కానీ ఈ ఉప-వేరియంట్ స్పైక్ ప్రోటీన్ రిసెప్టర్-బైండింగ్ డొమైన్‌పై కొన్ని ఉత్పరివర్తనాలను కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది. కాబట్టి ఇది వైరస్ కీలక భాగం. మానవ గ్రాహకానికి దానికదే జోడించబడి ఉంటుంది.. కాబట్టి మనం దానిని గమనించాలి. ఈ ఉప-వేరియంట్ అదనపు రోగనిరోధక ఎగవేత లక్షణాలను కలిగి ఉందా లేదా వైద్యపరంగా మరింత తీవ్రంగా ఉండే లక్షణాలను కలిగి ఉందో లేదో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియలేదు. మరింత సమాచారం వేచి చూడాలి" అని పేర్కొన్నారు.కొత్త వేరియంట్లపై WHO సాంకేతిక సలహా బృందం నిరంతరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న డేటాను పరిశీలిస్తోందని తెలిపారు.
ఇదిలావుండగా, ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆందోళన వ్యక్తం చేసింది. మార్చిలో గరిష్ట స్థాయి నుంచి క్షీణిస్తున్న ట్రెండ్ నమోదైంది. అయితే, జూన్ 27 నుండి జూలై 3 వరకు ఉన్న వారంలో 4.6 మిలియన్లకు పైగా కేసులు నమోదయ్యాయి. జూలై 3, 2022 నాటికి ప్రపంచవ్యాప్తంగా 546 మిలియన్లకు పైగా COVID19 కేసులు నమోదయ్యాయి. అలాగే, 6.3 మిలియన్లకు పైగా మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదవుతున్న కేసుల్లో ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు బీజే.5, బీఏ.4 కేసులు అధికంగా ఉంటున్నాయని గణాంకాలు పేర్కొంటున్నాయి. బీఏ.5 కేసులు ఇప్పటివరకు 83 దేశాల్లో గుర్తించగా, బీఏ.4 సబ్ వేరియంట్ కేసులను 73 దేశాల్లో వెలుగుచూశాయి. ఆగ్నేయ ఆసియా ప్రాంతం జూన్ ఆరంభం నుండి కేసులలో పెరుగుతున్న ధోరణిని నివేదిస్తోంది. గత వారంతో పోలిస్తే ఇది 20% పెరిగింది. డేటా అందుబాటులో ఉన్న 10 దేశాలలో (50 శాతం) ఐదు కొత్త కేసుల సంఖ్య 20% లేదా అంతకంటే ఎక్కువ పెరిగింది. ఇందులో భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్‌లలో అత్యధిక దామాషా పెరుగుదల కనిపించింది. భారత్ లోనూ క్రమంగా కరోనా కొత్త కేసులు పెరుగుతుండగటం ఆందోళన కలిగించే విషయమని పేర్కొంది.