
పశ్చిబెంగాల్ లో (west bengal) కరోనా కేసులు (corona virus) పెరుగుతున్నాయి. ఇప్పటికే ఆ రాష్ట్రం కరోనా ఆంక్షలు అమలు చేస్తోంది. దేశంతో పాటు రాష్ట్రంలోనూ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఆమె పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే 15 రోజులు చాలా కీలకమని అన్నారు. అప్పటికీ కరోనా మహమ్మారి కేసుల్లో ఎలాంటి తగ్గింపు లేనట్లయితే చాలా కఠిన ఆంక్షలను విధిస్తామని చెప్పారు. కరోనాను అరికట్టేందుకు ప్రభుత్వం విధించిన కోవిడ్ -19 (covid-19) ప్రోటోకాల్, ఆంక్షలకు కట్టుబడి ఉండాలని ఆమె ప్రజలను కోరారు. మాస్కులు ధరించాలని సూచించారు.రాష్ట్రంలోని సరిహద్దుల వద్ద ఆర్‌టీ- పీసీఆర్ (RT-PCR) పరీక్షలను తప్పనిసరి చేయాలని సీఎం మమతా బెనర్జీ అధికారులను ఆదేశించారు. ‘‘ రాబోయే 15 రోజులు చాలా కీలకం. మీ పట్ల, మీ ప్రియమైన వారి పట్ల మంచి శ్రద్ధ వహించండి. హ్యాండ్ గ్లౌసులు ధరించాలి. మాస్క్‌ను ఉపయోగించాలి. ఇలా చేసినప్పుడే అప్పుడే మనల్ని మనం రక్షించుకోగలం” అని ఆమె మీడియాతో చెప్పారు.
ప్రజల జీవితాలు, వారి జీవనోపాధిని పరిగణనలోకి తీసుకొని తాము ఆంక్షలు విధించామని ఆమె తెలిపారు. అయితే ఈ ఆంక్షలు అమలులో ఉన్నప్పటికీ కరోనా కేసులు పెరుగుతుంటే మాత్రం మళ్లీ కఠిన ఆంక్షలు అమలు చేస్తామని చెప్పారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తాము ఇంటి నుంచి పని చేయడాన్ని ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. తమ ప్రభుత్వంలోని పలువురు ముఖ్యమైన అధికారులు ఈ వ్యాధి బారిన పడ్డారని తెలిపారు. వారికి అవసరమైన అన్ని ఆరోగ్య వసతులు కల్పించామని అన్నారు. ఆ అధికారులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కోవిడ్ సోకిన వారితో కలిసి తిరిగిన వారు, కలిసి ఉన్న వారు క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. వారు సమాజంలో తిరిగి వైరస్ వ్యాపించేందుకు కారణం కాకూడదని అన్నారు.
తన డ్రైవర్ల ఇద్దరికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యిందని మమత బెనర్జీ తెలిపారు. కాబట్టి తాను సచివాలయానికి రాలేనని ఆమె చెప్పారు. అయితే నేడు కోల్‌కతాలోని చిత్తరంజన్ నేషనల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ రెండో క్యాంపస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొనాల్సి ఉంది. దీనిని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. అయితే కరోనా నేపథ్యంలో ఈ కార్యక్రమంలో ఆమె కాళీఘాట్‌లోని తన ఆఫీసు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొననున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ క్యాంపస్ ను ఢిల్లీ నుంచి రిమోట్‌తో ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం మొత్తం వర్చువల్‌గా సాగుతుందని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది.
ప్రస్తుతం పశ్చిమబెంగాల్ లో స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు పార్కులు, జూలు, స్విమ్మింగ్ ఫూల్స్, స్పాలు, జిమ్‌లు, బ్యూటీ పార్లర్‌లు, సెలూన్‌లు, వెల్‌నెస్ సెంటర్‌లు మూసివేశారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసులు 50 శాతం సామర్థ్యంతో పని చేస్తాయి. బార్లు రెస్టారెంట్లు రాత్రి 10 గంటల వరకు 50 శాతం సామర్థ్యంతో పని చేయస్తాయి. ఇదిలా ఉండగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ ( night curfew) కూడా అమలులో ఉంది.