దేశంలో పెరిగిన కరోనా విజృంభణ.. 24గంటల్లో 6వేలకు పైగా కొత్త కేసులు

By telugu news team  |  First Published May 22, 2020, 9:34 AM IST

మూడు రోజుల కిందటే కోవిడ్-19 బాధితుల సంఖ్య లక్ష దాటగా.. గడిచిన 20 రోజుల్లోనే దాదాపు 70వేల కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా బాధితులు లక్ష దాటిన దేశాల జాబితాలో భారత్ 11వ స్థానంలో నిలిచింది.
 


దేశంలో కరోనా విజృంభణ రోజు రోజుకీ పెరిగిపోతోంది. లాక్ డౌన్ 4 లో కొన్ని సడలింపులు చేయడంతో  కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6వేలకు పైగా కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. కాగా ఒక్క మహారాష్ట్రలోనే 2,334 కేసులు నమోదు కావడం గమనార్హం. 

ఆ రాష్ట్రంలో వరుసగా ఆరో రోజు పాజిటివ్ కేసులు 2వేల మార్క్ దాటడం గమనార్హం. దేశవ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 118,226కి చేరింది. ఇప్పటి వరకూ కరోనాతో దేశంలో మొత్తం 3,548 మంది ప్రాణాలు కోల్పోయారు. మూడు రోజుల కిందటే కోవిడ్-19 బాధితుల సంఖ్య లక్ష దాటగా.. గడిచిన 20 రోజుల్లోనే దాదాపు 70వేల కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా బాధితులు లక్ష దాటిన దేశాల జాబితాలో భారత్ 11వ స్థానంలో నిలిచింది.

Latest Videos

మరికొద్దిరోజుల్లో కరోనా కేసుల్లో భారత్ ఇరాన్ ని కూడా దాటే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక, మహారాష్ట్రలో మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల్లో 44% ఆ ఒక్క రాష్ట్రంలో ఉన్నాయి. ఆ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 41,000 మార్క్ దాటగా.. ఒక్క ముంబయి మహానగరంలోనే 25,500 మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. 

గత 24 గంటల్లో నమోదైన కేసుల్లో 80 శాతం.. మహారాష్ట్ర, దిల్లీ, తమిళనాడు, గుజరాత్‌, రాజస్థాన్‌లలోనే ఉన్నాయి. దేశంలో వెయ్యికి పైగా పాజిటివ్ కేసులు నమోదైన రాష్ట్రాల సంఖ్య ప్రస్తుతం 17కు చేరింది. నిన్న మొన్నటి వరకూ తక్కువ కేసులు నమోదయిన ఒడిశా, కర్ణాటక, హర్యానాలోనూ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోడం అందరినీ కలవర పెడుతోంది. 

click me!