Coronavirus: రెండు నెల‌ల త‌ర్వాత మ‌ళ్లీ 1% దాటిన కోవిడ్ పాజిటివిటీ రేటు

By Mahesh Rajamoni  |  First Published May 2, 2022, 1:40 PM IST

Coronavirus: భార‌త్ లో మ‌ళ్లీ క‌రోనా వైర‌స్ కేసులు క్ర‌మంగా పెరుగుతున్నాయి. రెండు నెల‌ల త‌ర్వాత దేశంలో క‌రోనా పాజిటివిటీ రేటు 1 శాతం దాటిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. 
 


Coronavirus fourth wave: ప్ర‌పంచంలోని చాలా దేశాల్లో క‌రోనా వైరస్ కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నాయి. మ‌రీ ముఖ్యంగా కొత్త వేరియంట్లు పుట్టుకురావ‌డం.. అవి ఇప్పటివ‌ర‌కు వెలుగుచూసిన వేరియంట్ల కంటే అత్యంత వేగంగా వ్యాపించే.. ప్ర‌మాద‌క‌ర‌మైన వేరియంట్లుగా అంచ‌నాలు ఉండ‌టంపై ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ కార‌ణంగా ఇప్ప‌టికే ల‌క్ష‌లాది మంది చ‌నిపోగా, కోట్లాది మంది అనారోగ్యానికి గుర‌య్యారు. భార‌త్ లోనూ మ‌ళ్లీ క‌రోనా వైర‌స్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో కోవిడ్‌-19 ఫోర్త్ వేవ్ ఆందోళ‌న‌లు అధికం అవుతున్నాయి.

వ‌రుస‌గా ఐదో రోజు కూడా భార‌త్ లో 3 వేల‌కు పైగా  కోవిడ్‌-19 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. భారతదేశంలో 3157 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి.  గత 24 గంటల్లో 26 మంది వైర‌స్ తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మొత్తం క‌రోనా వైర‌స్ కేసుల సంఖ్య  4,30,82,345 కు చేరుకుంది. మొత్తం కోవిడ్‌-19 మరణాల సంఖ్య 5,23,843 కు పెరిగింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం...  యాక్టివ్ కేసులు 19,500 కు చేరుకున్నాయి. క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి పాజిటివిటీ రేటు సైతం మ‌ళ్లీ రెండు నెలల గరిష్ఠానికి చేరుకుంది. ప్ర‌స్తుతం క‌రోనా పాజిటివిటీ రేటు 1.07 శాతంగా ఉంద‌ని కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. అంత‌కుముందు  ఫిబ్రవరి 27న ఇది 1.11 శాతంగా ఉంది. వారపు రేటు 0.70 శాతంగా ఉంది. 

Latest Videos

undefined

మొత్తం ఇన్ఫెక్షన్‌లలో యాక్టివ్ కేసులు 0.05 శాతం ఉండగా, దేశంలో కోవిడ్-19 రికవరీ రేటు 98.74 శాతంగా నమోదైందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. క‌రోనా వ్యాధి నుండి కోలుకున్న వారి సంఖ్య 4,25,38,976కి పెరిగింది, అయితే కేసు మరణాల రేటు 1.22 శాతంగా నమోదైంది. దేశవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు దేశంలో నిర్వహించబడిన సంచిత మోతాదుల సంఖ్య 189.23 కోట్లను దాటింది. దేశంలో క‌రోనా కేసుల పెరుగుద‌ల‌ను గ‌మ‌నిస్తే.. ఆగస్టు 7, 2020న 20 లక్షలు, ఆగస్టు 23న 30 లక్షలు, సెప్టెంబర్ 5న 40 లక్షలు మరియు సెప్టెంబర్ 16న 50 లక్షలకు కోవిడ్‌-19 కేసులు చేరుకున్నాయి. ఇక డిసెంబర్ 19న కోటి మార్కును అధిగమించింది.  మే 4న రెండు కోట్లు, జూన్ 23న మూడు కోట్ల మైలురాయిని అధిగమించింది. 

కాగా, గ‌త కొంత కాలంగా దేశంలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయి. అయితే, ప్ర‌స్తుతం మ‌ళ్లీ పెరుగుతున్నాయి. వ‌రుస‌గా ఐదో రోజు మూడు వేల‌కు పైగా క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ఇదిలావుండ‌గా, దేశంలో క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి కేసులు, మ‌ర‌ణాలు అధికంగ నమోదైన రాష్ట్రాల జాబితాలో మ‌హారాష్ట్ర టాప్ ఉంది. ఆ త‌ర్వాతి స్థానంలో కేర‌ళ‌, క‌ర్నాట‌క‌, త‌మిళ‌నాడు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్, వెస్ట్ బెంగాల్‌, ఢిల్లీ, ఒడిశా, రాజ‌స్థాన్‌, గుజ‌రాత్, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్ లు ఉన్నాయి.  దేశంలో మ‌ళ్లీ క‌రోనా వైర‌స్ కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వాలు క‌రోనా మార్గ‌ద‌ర్శ‌కాల‌ను పాటించాల‌ని ప్ర‌జ‌ల‌కు సూచిస్తున్నాయి. మాస్కుల‌ను త‌ప్ప‌నిస‌రి చేస్తూ నిబంధ‌న‌లు అమ‌ల్లోకి తీసుకువ‌చ్చాయి. 

click me!