Coronavirus: దేశరాజధాని జైళ్లలో కరోనా కలకలం.. తిహార్ జైల్లో 76 మందికి పాజిటివ్

By Mahesh Rajamoni  |  First Published Jan 11, 2022, 12:34 PM IST

Coronavirus: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వ్యాప్తి మరింతగా పెరుగుతోంది. ఇప్పటికే ఢిల్లీలో పాజిటివిటీ రేటు రికార్డు స్థాయిలో 25 శాతానికి పెరిగింది. దీనికి తోడు ప్రస్తుతం ఢిల్లీ జైళ్లలో కరోనా కలకలం రేపుతున్నది. అక్కడి జైళ్లలో కరోనా బారినపడుతున్న వారి సంఖ్య పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతున్నది. 
 


Coronavirus: దేశంలో కరోనా వ్యాప్తి అధికమవుతున్నది. గత నవంబర్ లో వెలుగుచూసిన కరోనా వైరస్ కొత్త వేరియంట్ విజృంభ‌ణ కార‌ణంగా కొత్త కేసులు గ‌ణ‌నీయంగా పెరుగుతున్నాయి. ల‌క్ష‌ల్లో రోజువారీ కేసులు (Coronavirus) న‌మోదు అవుతున్నాయి. దేశ రాజ‌ధాని ఢిల్లీలో క‌రోనా బారిన‌ప‌డుతున్న వారి సంఖ్య క్ర‌మంగా పెరుగుతూ వ‌స్తున్న‌ది. పాజిటివ్ కేసులు పెరుగుతుండ‌టం, ఆస్ప‌త్రుల్లో క‌రోనాతో చేరే వారి సంఖ్య ఎక్కువ‌వుతుండ‌టంపై ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతున్న‌ది. ఇదిలావుండ‌గా, ప్ర‌స్తుతం ఢిల్లీ జైళ్ల‌లో క‌రోనా వైర‌స్ క‌ల‌క‌లం రేపుతున్న‌ది. తాజాగా ఢిల్లోని జైల్లో 66 మంది ఖైదీలు, 48 మంది సిబ్బందికి కరోనా వైర‌స్ సోకింది. తిహార్ జైల్లో 42 మంది ఖైదీలు, 34 మంది జైలు సిబ్బందికి కరోనా సోకింద‌ని సంబంధిత అధికారులు వెల్ల‌డించారు. అలాగే, మండోలి జైల్లో 24 మంది ఖైదీలు, 8 మంది జైలు సిబ్బందికి కూడా కరోనా సోకింద‌ని అధికారులు తెలిపారు. రోహిణి జైల్లో కూడా ఆరుగురు సిబ్బంది క‌రోనా (Coronavirus) మ‌హ‌మ్మారి బారిన‌ప‌డ్డారు. 

ఇదిలావుండ‌గా, ఢిల్లీలో క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి బారిన‌ప‌డుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. క‌రోనా మహమ్మారి కట్టడి కోసం శ్రమిస్తున్న పోలీసులు సైతం కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. కానిస్టేబుల్ నుంచి ఉన్నతాధికారుల వరకు గత 10 రోజుల్లో 1000మందికి కరోనా (Coronavirus) సోకింది. ఢిల్లీ అడిషనల్ కమిషనర్ చిన్మయ్ బిస్వాల్, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సహా వెయ్యి మంది వైరస్ బారినపడ్డారని ఢిల్లీ పోలీసు శాఖ అధికారులు వెల్ల‌డించారు. కొత్త‌గా క‌రోనా బారిన‌ప‌డ్డ ఈ వేయి మందిలో చాలా మందికి క‌రోనావైర‌స్ ల‌క్ష‌ణాలు స్వ‌ల్పంగా ఉన్నాయ‌ని పేర్కొన్నారు. ప్ర‌స్తుతం వీరు హోం క్వారంటైన్ లో ఉన్నార‌ని తెలిపారు. వైద్యం అవ‌స‌ర‌మైన వారికి హోం క్వారంటైన్ లోనే చికిత్స అందిస్తున్నామ‌ని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. 

Latest Videos

ఢిల్లీలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ నేప‌థ్యంలో అధికారులు అందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. క‌రోనా కొత్త కేసుల‌తో పాటు యాక్టివ్ కేసులు, ఆస్ప‌త్రుల్లో చేరుతున్న వారు గ‌ణ‌నీయంగా పెరుగుతున్నారు. ఢిల్లీలో కరోనా ఇన్‌ఫెక్షన్ రేటు సోమవారం నాటికి 25 శాతానికి పైగా పెర‌గ‌డం అక్క‌డ క‌రోనా వైర‌స్ ఉధృతికి అద్దం ప‌డుతోంది. గ‌త 24 గంట‌ల్లో ఢిల్లీలో కొత్త‌గా 19,166 మందికి క‌రోనా సోకింది. క‌రోనాతో పోరాడుతూ 17 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఢిల్లీలో మొత్తం క‌రోనా వైర‌స్ కేసుల  (Coronavirus) సంఖ్య 15,68,896 కు చేరింది. కోవిడ్‌-19 మ‌ర‌ణాలు 25,177కు పెరిగాయి.  ఈ నేప‌థ్యంలో ఢిల్లీ యంత్రాంగం క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌లు వేగ‌వంతం చేసింది. దీనిలో భాగంగా మంగ‌ళ‌వారం నాడు ఢిల్లీ డిజాస్టర్‌ మేనేజ్మెంట్‌ అథారిటీ కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రభుత్వ, ప్ర‌యివేటు ఆఫీసులను మూసివేయాలని నిర్ణయించింది. ఎమర్జన్సీ సర్వీసులు మినహా మిగిలిన ఉద్యోగులు అందరూ ఇంటి నుంచే పనిచేయాలని ఆదేశించింది. మినహాయించిన కేటగిరీకి చెందిన ప్ర‌యివేటు  కంపెనీలు మినహా ... మిగిలిన ఆఫీసులు మూసివేయాలని ఆదేశించింది. ఇదిలావుండ‌గా, దేశంలో క‌రోనా కేసులు (Coronavirus) అధికం అవుతున్నాయి. గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 1.68 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 8 లక్షలు దాటింది. అలాగే కొత్తగా 277 మంది కరోనా మహమ్మారితో మ‌ర‌ణించారు. మొత్తం కోవిడ్‌-19 మ‌ర‌ణాలు 4,84,213 పెరిగాయి. 

click me!